July 12, 2026

Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?
Reading Time: < 1 minute
Suresh Raina Reveals Why He Rejected Captaincy Offers And Stayed Loyal To Csk

Suresh Raina Reveals Why He Rejected Captaincy in IPL: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎన్నో ఏళ్లు ఆడాడు. 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఆడిన రైనా.. 205 మ్యాచ్‌లలో 5,528 పరుగులు చేశాడు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సెంచరీ (100 నాటౌట్) బాదాడు పరుగులు. 2012 ఫైనల్‌లో కేకేఆర్‌పై 38 బంతుల్లో 73 పరుగులు, 2014 క్వాలిఫయర్‌లో పంజాబ్‌పై 87 పరుగులు అతడి ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్. చెన్నై తరఫున 8 సీజన్లలో 400+ పరుగులు చేసిన రైనా.. చివరి మ్యాచ్ 2021లో అక్టోబర్ 2న రాజస్థాన్ రాయల్స్‌పై ఆడాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో సీఎస్కేపై తనకున్న అనుబంధాన్ని రైనా మరోసారి వెల్లడించాడు.

ఐపీఎల్‌లో ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినప్పటికీ, సీఎస్కే జట్టును వీడాలని తాను ఎప్పుడూ అనుకోలేదని సురేష్ రైనా స్పష్టం చేశాడు. ‘నేను ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశా. సీఎస్కేకు కూడా కొన్ని మ్యాచ్‌లలో నాయకత్వం వహించా. ఐపీఎల్‌లో ఇతర ఫ్రాంచైజీలు నన్ను సంప్రదించి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినా.. నేను స్వీకరించలేదు. అందుకు కారణం ఎంఎస్ ధోనీ. మనమిద్దరం సీఎస్కేకు కెప్టెన్లమే, నువ్వు నా కెప్టెన్, నేను నీ కెప్టెన్ అని ధోనీ ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మాటలే నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. అందుకే జట్టు మారాల్సిన అవసరం అనిపించలేదు’ అని రైనా చెప్పాడు.

Also Read: Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!

‘నాకు వ్యక్తిగత విజయాల కంటే జట్టు విజయాలే ముఖ్యం. ప్లేయర్‌గా జట్టుకు విజయం అందించడం, సహచర ఆటగాళ్లకు సహాయం చేయడం నా కర్తవ్యం. నేను ఐపీఎల్‌లో కెప్టెన్సీ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. కెప్టెన్సీ కోరుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని. చెన్నై జట్టు నాకు ఓ ఫ్యామిలి లాంటిది. జట్టు కోసం ఆడటమే నాకు ముఖ్యం అని భావించా’ అని సురేష్ రైనా స్పష్టం చేశాడు. మొత్తానికి రైనా చేసిన ఈ వ్యాఖ్యలు సీఎస్కే జట్టుపై అతనికున్న నిబద్ధత, ధోనీతో ఉన్న అనుబంధాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.