Reading Time: 3 minutes

విద్యాలయాలు భావిభారత పౌరులను మాత్రమే తయారు చేసేవి కావు. వారికి అవసరమైన జ్ఞానంతోపాటుగా వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ లాంటివి నేర్పి దేశానికి ఉపయోగపడే మానవ వనరులను ఉత్పత్తి చేసే కేంద్రాలు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అంటే దైవం కూడా తర్వాత స్థానమే. అందుకే అదొక బాధ్యతయుతమైన వృత్తి మాత్రమే కాదు గౌరవనీయమైన వృత్తి కూడా. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును గురువు చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటారు. వారు కనీసం పట్టించుకోరు ఎందుకంటే అది గురువుపై వారికి ఉన్న అచంచల విశ్వాసం. విద్యార్థి శారీరక మానసిక ఆరోగ్యం బాగోగులుచూసుకునేది ఉపాధ్యాయులు. విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేది తరగతి గదిలోని టీచర్ల చేతలే! విద్యార్థులకు ఉపాధ్యాయులే ఆదర్శం. వారిని అనుకరిస్తారు, అనుసరిస్తారు. అలాంటి ఉపాధ్యాయ వర్గం తప్పు చేస్తే విద్యార్థులు నమ్మలేరు, సహించలేరు. ఈ మధ్య జరిగిన వరుస సంఘటనల్లో ఉపాధ్యాయుల వింత ప్రవర్తన, విపరీత ధోరణి సమాజానికి ఆశ్చర్యమే కాదు, వారిపట్ల ఏహ్య భావాన్ని కూడా కలిగిస్తున్నాయి. వారు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారు. వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా లేక యాజమాన్యాలు వారిని ఆ రకంగా తీవ్రమైన చర్యలకు ప్రేరేపించుతున్నాయా అనేది అధ్యయనం చేయవలసిన అంశం.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో నడుస్తున్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక విద్యార్థి జుట్టు బాగా పెరిగిందని చెప్పి పాఠశాల యాజమాన్యం అతడికి పూర్తిగా గుండు కొట్టించింది. విద్యార్థి అంతగా ప్రతిఘటించినా, వారించినా పాఠశాల యాజమాన్యం వినలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్ద గొడవకు దిగారు. తమ కొడుకుకు లక్ష్మీనరసింహస్వామి మొక్కు ఉందని గతంలోనే తాము పాఠశాల ప్రిన్సిపాల్‌కు చెప్పడం జరిగిందని అయినా వారు అతడికి గుండు కొట్టించడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. తమ కొడుకు తల వెంట్రుకలు (కత్తిరించినవి) కావాలని అవైనా స్వామికి సమర్పిస్తామని వారు కోరారు. అతిగా జుట్టు పెంచుకోవడం పాఠశాల నియమ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు కానీ వారు ఆ విద్యార్థిని బయట నిలబెట్టడం ఇంటికి పంపడం లేక తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడడం చేసినట్లయితే ఇంత వివాదానికి దారి తీసేది కాదు. పైగా అది మొక్కుకు సంబంధించినది. వారి మనోభావాలు దెబ్బతిని వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థి లేదా అతని తల్లిదండ్రుల మనసును గాయపరచకుండా శిక్షిస్తే బాగుండేది. కానీ పాఠశాల ప్రిన్సిపాల్ గుండు కొట్టించడంతో సమస్య రచ్చగా మారింది.

విద్యార్థి ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు అదే పాఠశాలలో చదువుకుంటున్నాడని అతడి తల్లి తెలిపింది. పాఠశాల వారు అతిగా ప్రవర్తించడం సర్వదా చర్చనీయాంశమైంది. క్రమశిక్షణను అమలు చేసే ప్రయత్నంలో దాని పరిమితి దాటితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన మరో సంఘటనలో ఒక పాఠశాల విద్యార్థులు కొంతమంది షూస్ వేసుకురాకుండా పాఠశాలకు హాజరయ్యారు. అది గమనించిన ఉపాధ్యాయురాలు ఆగ్రహంతో విద్యార్థుల మెడలో వారు ధరించిన చెప్పులను దండగా వేయించింది. అది విద్యార్థులకు ఎంత అవమానకరమో ఆ టీచర్ కనీసం ఆ క్షణంలో ఆలోచించారా? తోటి విద్యార్థుల మధ్య తమకు జరిగిన అవమానానికి వారు అదృష్టవశాత్తు ఏ దుశ్చర్యకు పాల్పడలేదు.

లేదంటే ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. వారి చేసిన నేరం షూస్ కాకుండా చెప్పులు వేసుకురావడమే! చెప్పులు వేసుకు రావడం పాఠశాల నియమ నిబంధనలకు విరుద్ధం కావచ్చు, కానీ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని భంగపరచవచ్చని వారి నియమాల్లో ఉన్నదా? ప్రశ్నించిన తల్లిదండ్రులతో కూడా ఆ పాఠశాల ఉపాధ్యాయులు మర్యాదగా మాట్లాడలేదు. పైగా తమ చర్యను సమర్థించుకోవడం జరిగింది. తర్వాత రోజు నుండి విద్యార్థులందరూ షూస్ వేసుకొస్తున్నారని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అంటే మిగిలిన విద్యార్థులను ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నది స్పష్టం అవుతున్నది. క్రమశిక్షణ పేరుమీద విద్యార్థుల మెడలో చెప్పుల దండవేసి వారిని అగౌరవ పరుస్తారా? దీనిని క్రమశిక్షణ అంటారా? క్షమాపణలు చెప్పినంత మాత్రాన వచ్చిన మచ్చ మాసిపోతుందా? జరిగిన అవమానం సమసిపోతుందా?

ఈ రెండు రోజుల్లో జరిగిన వేరువేరు సంఘటనల్లో ఉపాధ్యాయులు మరింత కర్కశంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది. హోంవర్క్ చేసుకరాలేదన్న నెపంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని వాతలు తేలేలా కొట్టడం జరిగింది. పర్యవసానంగా ఇంటికి చేరిన విద్యార్థి సరిగా నిలబడలేక కూర్చోలేక ఇబ్బంది పడుతుండగా గమనించిన తల్లి విషయం తెలుసుకొని సదరు టీచర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఏం చేసుకుంటావో చేసుకో అన్న తీరుగా ప్రవర్తించాడు. మరొక మహిళా టీచర్ కూడా అదే విధంగా ఐదవ తరగతి విద్యార్థికి శరీరంపై వాతలు తేలేలా కొట్టింది. ఎందుకింత అమానుషత్వం? తప్పులు విద్యార్థులు కాక మరెవరు చేస్తారు? వాటిని సరిదిద్దాల్సిన టీచర్లు సంయమనం కోల్పోయి విచక్షణ మరిచిపోయి విద్యార్థులను శారీరకంగా శిక్షించడం ఏమాత్రం తగదు. ఇది విద్యార్థికి ఆ టీచర్ పట్ల అతడు చెప్పే సబ్జెక్టుపట్ల వ్యతిరేక భావాన్ని కలుగజేసి భవిష్యత్తులో అతడు చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. విద్యార్థితో సున్నితంగా ప్రవర్తించాలి అన్న కనీస అవగాహన లోపించడం ఉపాధ్యాయ లోకాన్ని ఆత్మపరిశీలనలో పడవేస్తుంది.

విద్యార్థులకు విద్యతోపాటుగా క్రమశిక్షణ అవసరమే. దానిని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నడవడిక ప్రవర్తనతోనే విద్యార్థులు సగం నేర్చుకుంటారు. వారి సమయపాలన, నీతి నిజాయితీ, నిబద్ధత విద్యార్థులను ఆకట్టుకొని వారిని అనుకరించి అనుసరించేలా చేస్తాయి. కానీ విద్యాసంస్థలు క్రమశిక్షణ పేరిట భయోత్పాతం సృష్టించకూడదు. వారిని సంస్కరించాలి. వారిలో పరివర్తన తీసుకురావాలి. వారు తమ తప్పు తెలుసుకొని దానిని పునరావృతం చేయకుండా వారిలో మానసిక మార్పు తేవాలి. విద్యార్థులు సహజంగా ఆలస్యంగా రావడం, హోంవర్క్ చేయకపోవడం, తరగతిగదిలో అల్లరి చేయడం, తక్కువ మార్కులు సాధించడం లేదా పాఠశాల నియమ నిబంధనలను సరిగా పాటించకపోవడం – ఇవన్నీ ఘోరమైన తప్పిదాలు ఏమీ కావు. వీటి వల్ల మొత్తం సమాజం వెంటనే చెడిపోదు. వారిని మందలించవచ్చు, నిలదీయవచ్చు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. అంతేకానీ వారిని అవమానించే హక్కులేదు. వారిని శారీరకంగా, మానసికంగా హింసించకూడదని చట్టాలు ఘోషిస్తున్నాయి. వారి ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ చర్య అయిన అది సమర్థనీయం కాదు. కొన్నిసార్లు ఉపాధ్యాయులు విచక్షణ మరచి విద్యార్థులను గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. ఆ దెబ్బ తగలరాని చోట తగిలితే అది ఆ విద్యార్థికి జీవితాంతం శిక్ష అవుతుంది. ఆ రకంగా చెవులు కండ్లు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఇది ఉపాధ్యాయ లోకానికి మచ్చతెచ్చే విషయం. విద్యార్థులను ప్రేమతో చూసుకోవాల్సిన వారు తల్లిదండ్రుల లాగా కాపాడవలసిన వారు సహనం కోల్పోయి ఆ రకంగా ప్రవర్తించడాన్ని సభ్యసమాజం ఖండిస్తుంది.

ఉపాధ్యాయ లోకం తలదించుకుంటుంది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు ఇచ్చే శిక్ష వారికి జీవితాంతం శాపం కాకూడదు. మనస్తత్వశాస్త్రం చదివిన ఉపాధ్యాయులే ఈ విధంగా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తే అమాయక విద్యార్థులు తప్పులు చేయడంలో తప్పేముంది? క్షమాగుణంతో విద్యార్థి మనసును, ప్రవర్తనను మార్చగలమన్న కనీస జ్ఞానాన్ని వీరు ఆవేశంలో మరిచిపోతున్నారా? విద్యాలయాలు సంస్కరణాలయాలుగా మారాలి. పరివర్తనా కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలి. సున్నిత మనస్కులైన విద్యార్థినీ విద్యార్థులను అనునయంగా మాట్లాడ్డం ద్వారా వారి మనసును మార్చవచ్చు, గెలవవచ్చు, పరివర్తన తీసుకురావచ్చు. దండనల ధోరణి మారాలి. విద్యార్థుల మనసునెరిగి బోధించేవాడు, ప్రవర్తించేవాడే నిజమైన గురువు. అక్షర జ్ఞానం అందించడమే అతడి లక్ష్యం కాకూడదు. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అందించి భవిష్యత్తుకు ఉత్తమమైన పౌరులను మంచి మానవ వనరులను తయారు చేసే విధంగా ఉపాధ్యాయుడి దండనలు ఉండాలి. వ్యక్తిత్వ నిర్మాణం విలువల నిర్వహణ దిశగా అతని బోధనలు ప్రభావితం చేయాలి. విద్యార్థుల మనోభావాలను గౌరవించాలి. వారి ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ఆత్మస్థైర్యం నెలకొల్పే విధంగా ఉపాధ్యాయుడు చేస్తే అతడు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. వారికి ఆదర్శంగా కూడా నిలుస్తాడు.

– శ్రీ శ్రీ కుమార్