Reading Time: 2 minutes

దుబాయ్ : ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా, పరిపాలకునిగా ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని పరిగణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో తన తండ్రి మృతి చెందక ముందు, యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన ప్రభుత్వ పదవికి ఎంపిక కాలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో రహస్యమైన వ్యక్తిగా ఉన్న మొజ్తాబా శనివారం నుంచి బయటకు కనిపించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ వైమానిక దాడి సుప్రీం లీడర్ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని 86 ఏళ్ల తన తండ్రిని హత్య చేసింది. అంతేకాదు యువ ఖమైనీ భార్య జహ్రా హడ్డాద్‌అడెల్‌ను కూడా హత్య చేసింది.

మొజ్తాబా ఖమేనీ సజీవంగానే ఉన్నట్టు నమ్ముతున్నారు. అమెరికాఇజ్రాయెల్ దాడుల కారణంగా అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఆయన ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయలేదు. దైవ పరిపాలనగా ఇరాన్ పూర్వ వంశపారంపర్య రాజరికంపై విమర్శలు ఉన్నప్పటికీ మొజ్తాబా ఖమేనీ పేరు ప్రచారంలో కొనసాగుతోంది. మొజ్తాబా తండ్రి ఆయతుల్లా ఖమేనీ, భార్య జహ్రా హడ్దాద్‌ను అమరవీరులుగా ఇరాన్‌లో ప్రస్తుతిస్తున్నారు. 88 సీట్ల ఇరాన్ అసెంబ్లీలో వృధ్ధాప్య మతాధికారుల సంఖ్య పెరగడంతో ఖమేనీ వంశస్థుల సంఖ్య కూడా పెరిగింది. తదుపరి నాయకుడిని ఈ అసెంబ్లీయే ఎన్నుకుంటుంది.

ఎవరైతే ఇరాన్ సుప్రీం అవుతారో వారు ఇప్పుడు యుద్దంలో ఇరాన్ మిలిటరీపై నియంత్రణ కలిగి ఉండటమే కాక, అణ్వాయుధ నిర్మాణానికి కావలసిన యురేనియం నిల్వలను కూడా పర్యవేక్షించవలసి ఉంటుంది. మొజ్తాబా 1969లో ఇరాన్ లోని మషాద్‌లో జన్మించారు. ఆయన పదేళ్ల వయసులో ఇరాన్‌లో 1979 లో ఇస్లామిక్ రివల్యూషన్ సాగింది. ఇరాన్‌లో షా మొహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా తన తండి ఆయతుల్లా ఖమేనీ ఉద్యమం సాగించారు. అలాంటి పరిస్థితుల్లో మొజ్తాబా పెరిగారు. షా సీక్రెట్ పోలీస్ “ఎస్‌ఎవిఎకె ” తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో మొజ్తాబా,మిగతా కుటుంబీకులు తమ తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికో వెళ్లారని సీక్రెట్ పోలీసులకు చెప్పారు. షా ప్రభుత్వం పతనమైన తరువాత ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది.

1989 లో ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన తరువాత తండ్రితో పాటు మొజ్తాబా అధికారిక కార్యకలాపాల్లోనే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులను విస్తరింప చేశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా సైనికులకు అండగా ఉండి తీవ్రవాదుల మధ్య విశ్వసనీయతను పొందారు. చాలా కాలంగా పాలనలో శక్తివంతమైన వ్యక్తిగా, మతాధికారులు, రివల్యూషనరీ గార్డ్‌కమాండర్ల నెట్‌వర్క్ నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019లో అమెరికా ట్రజరీ మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. అతను ప్రభుత్వంలో ఎన్నుకోబడక పోయినా, అధికారిక హోదాలో తన తండ్రి తరఫున అధికారం చెలాయించాడని ఆరోపించింది. ఖమేనీ కుటుంబీకులు అనేక మంది హత్యకు గురైన సంఘర్షణ కాలంలో నిలబడిన నాయకునిగా మొజ్తాబా ఇమేజ్ దృఢ పడింది.