
అమరావతి: టిడిపిలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. టిడిపి ఎంపి కేశినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. ఎంపి అంటే ఎమ్మెల్యే కొలికపూడి కొత్త అర్థం చెప్పారు. గంపలగూడెంలోని నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎంపి కేశినేని చిన్ని, ఎంఎల్‌ఎ కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయతీ చోటుచేసుకోవడంతో కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని చిన్ని దృష్టిలో ఎంపి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు అని, ఎం అంటే మట్టి, పి అంటే పేకాటగా మార్చేశారని చురకలంటించారు. ఎంఎల్‌ఎ సీటు కోసం తన వద్ద ఎంపి కేశినేని డబ్బులు తీసుకున్నారని కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేశినేని చిన్ని చేతుల్లోనే పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కోవడంతో అక్కడి ఉన్నవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొలికపూడిని ఎంపి చిన్ని వర్గీయులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. గతంలో గంపలగూడెం మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫొటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ అంటూ ఫొటోకు క్యాప్షన్ పెడుతూ బంగారు కొండ మానుకొండ అంటూ సోషల్ మీడియాలో కొలికపూడి పోస్టులు పెట్టడంతో వైరలగా మారాయి.