Reading Time: < 1 minute

సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సూర్య46’ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పేరు విన్న తక్షణమే ఒక క్లాసీ, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాన్ని చూడబోతున్నామని స్పష్టమవుతోంది. సూర్య ఒక చిన్నారితో కలిసి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, సూర్యలోని పాతకాలపు మాధుర్యాన్ని మళ్లీ తెరపై చూపిస్తూ ప్రేక్షకులకు అందమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

గొప్ప కథకుడిగా, భావోద్వేగాలతో కూడిన రచనకు పేరుగాంచిన ఆయన, ఈ సినిమాతో మరో చిరస్మరణీయ అనుభూతిని అందించనున్నారు. విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొనగా.. వాటిని రెట్టింపు చేసేలా త్వరలోనే టీజర్ విడుదల కానుంది. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాల తర్వాత ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి మరో ప్రతిష్టాత్మక తమిళ-, తెలుగు ద్విభాషా చిత్రాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.