Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జి ల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ -వేలంలో భారీ అక్రమాలు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ సోమవారం కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గనుల శాఖ విడుద ల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు, పారదర్శకత లోపాలు ఉన్నట్లు తెలిపా రు. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్‌పూర్ మైనింగ్ బ్లాక్‌లలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్‌డ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ, టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదని ఆ రోపించారు. ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల ఖచ్చితమైన అక్షాంశ-రేఖాంశ కోఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డిజిపిఎస్ సర్వే ధృవీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు,యుటిఎం జియో కోఆర్డినేట్లు, మినరల్ ఆక్షన్ రూల్స్, 2015, మై న్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్,

1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి లోపాలు వే లం ప్రక్రియ చట్టబద్ధతను, పారదర్శకతను తీ వ్రంగా దెబ్బతీస్తాయని విమర్శించారు. టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్‌లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం త ప్పనిసరి అయినప్పటికీ,ఈ నిబంధనలు పాటించలేదని అన్నారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం,చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. సైదుల్నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్ బ్లాక్‌కు ఎన్‌సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని,

ఈ సంస్థలు రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అలాగే, మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్‌ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతోందని అన్నారు. అటవీ శాఖ నుండి తప్పనిసరిగా పొందవలసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఒసి) లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని, రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ జరగడం పర్యావరణానికి ముప్పు కలిగించడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటిఫికేషన్ కింద చేపట్టిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని, స్వతంత్ర, పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కెటిఆర్ కోరారు. ఈ లేఖ ప్రతులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు.