Reading Time: 2 minutes

Happy life : 60 తర్వాత… ఇలా జీవించండి.. సంతోషంగా ఉంటారు..!

Caption of Image.

పిల్లల పెంపకం పూర్తయింది.. ఉద్యోగ బాధ్యతలూ ముగిశాయి.. మరి ఇక జీవితం? కొత్త స్నేహాలు, కొత్త అనుభవాలతో మరోసారి మనసుకు నచ్చినట్టు జీవించేందుకు ఇదే సరైన సమయం! 

ఉదయం కాఫీ కప్పుతో మొదలయ్యే రోజు.. ఒకప్పుడు ఆఫీసు హడావుడితో సాగేది. ఆ తర్వాత పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. ఇలా కాలం తెలియకుండానే గడిచిపోయింది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఉద్యోగం లేదు, పిల్లలు తమ ప్రపంచంలో బిజీ, ఇంట్లో మాత్రం చెప్పుకోవడానికి పెద్దగా కొత్త విషయాలేమీ ఉండవు. 

అప్పుడే ఎదురయ్యే ప్రశ్న.. ‘ఇక నా కోసం ఏముంది?’ ఈ ప్రశ్నకు ఇప్పుడు చాలామంది సీనియర్లు తమదైన సమాధానం వెతుక్కుంటున్నారు. 60 ఏళ్లు దాటినంత మాత్రాన జీవితం నెమ్మదించాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు. కొత్త స్నేహాలు చేసుకుంటూ.. ఇష్టమైన ఆటలు ఆడుతూ.. ప్రయాణాలు చేస్తూ.. కలిసి భోజనం చేస్తూ.. మళ్లీ తమలోని చిన్నారిని బయటకు తీసుకొస్తున్నారు.

మనసుకు నచ్చిన ‘థర్డ్‌ స్పేస్‌’

ఇల్లు ఒక ప్రపంచం. ఉద్యోగం మరో ప్రపంచం. ఈ రెండింటికీ మధ్యలో.. మనసుకు నచ్చిన వారితో గడిపే మరో చిన్న ప్రపంచం ఉంటే? అదే ‘థర్డ్‌ స్పేస్‌’. సీనియర్ల కోసం ఏర్పడుతున్న సప్పర్‌ క్లబ్‌లు, బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ గ్రూపులు, పికిల్‌బాల్‌ కోర్టులు, గేమ్‌ నైట్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ట్రావెల్‌ కమ్యూనిటీలు ఇప్పుడు అలాంటి వేదికలుగా మారుతున్నాయి. ఇక్కడ ‘మీ వయసెంత?’ అన్న ప్రశ్న కంటే ‘మీకు ఏం ఇష్టం?’ అన్నదే ముఖ్యమవుతోంది. ఒకే ఆట, ఒకే పాటపై ఆసక్తి ఇద్దరిని కలుపుతుంది. ఒక చిన్న ప్రయాణం.. అపరిచితులను స్నేహితులుగా మారుస్తుంది.

పిల్లలు దూరంగా ఉన్నా.. 

పిల్లలు తమ భవిష్యత్తు కోసం మరో నగరానికి, మరో దేశానికి వెళ్లడం సహజమే. కానీ వారి దూరం వల్ల తల్లిదండ్రుల జీవితంలో ఏర్పడే ఖాళీ మాత్రం అంత సులభంగా పూడదు. ఉద్యోగ విరమణతో ఆఫీసులోని పరిచయాలు కూడా తగ్గిపోతాయి. అందుకే ఈ దశలో ఆరోగ్యం, ఆర్థిక భద్రత ఎంత ముఖ్యమో.. ‘నన్ను పలకరించే మనుషులు ఉన్నారు’ అనే భావన కూడా అంతే ముఖ్యం.

భారతదేశంలో వృద్ధుల సంఖ్య రానున్న దశాబ్దాల్లో గణనీయంగా పెరగనుంది. కాబట్టి వృద్ధాప్యాన్ని కేవలం ఆరోగ్య సమస్యగా కాకుండా.. సామాజిక జీవితం, స్నేహాలు, ఆనందం, ఆత్మీయతతో కూడిన జీవిత దశగా చూడాల్సిన అవసరం ఉంది. 60 తర్వాత జీవితం ముగిసే అధ్యాయం కాదు.

 పిల్లల కోసం జీవించిన సంవత్సరాల తర్వాత.. మన కోసం మనం జీవించడానికి దొరికిన కొత్త పేజీ. ఎవరితో నవ్వాలో.. ఎక్కడికి వెళ్లాలో.. ఏ ఆట ఆడాలో.. ఏ కొత్త విషయాన్ని నేర్చుకోవాలో మనమే ఎంచుకునే సమయం.ఎందుకంటే వయసు పెరిగేకొద్దీ మన చుట్టూ ఉన్న మనుషుల సంఖ్య తగ్గాల్సిన అవసరం లేదు.. మనసుకు దగ్గరైన మనుషుల సంఖ్య పెరగొచ్చు. కొన్నిసార్లు రక్తసంబంధాల కంటే.. మనసుతో ఎంచుకున్న స్నేహాలే జీవితానికి నిజమైన తోడుగా మారతాయి.

గమనిక: మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.
 

©️ VIL Media Pvt Ltd.