Reading Time: 2 minutes
Mk Stalin Takes Dig At Cm Vijay Over Misa Reference In Tamil Nadu Assembly

CM Vijay vs MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తనను ఉద్దేశించి MISA (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ప్రస్తావన చేయడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీని అనవసర వివాదాలకు వేదికగా మార్చొద్దని సీఎం విజయ్‌కు సూచించారు. సోషల్ మీడియా రీల్స్, ప్రచార కార్యక్రమాలతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్‌పై స్టాలిన్ ఆరోపణలు చేశారు. ‘‘మీరు సినిమాల షూటింగ్‌లా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’’ అంటూ విమర్శించారు.

‘సినిమా షూటింగ్‌లా ప్రభుత్వం నడుపుతున్నారు’

స్టాలిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో విడుదల చేసిన వీడియోలో సీఎం విజయ్‌ను ‘తంబి విజయ్’ (సోదరుడు విజయ్) అని సంబోధించారు. అసెంబ్లీని రీల్స్ చేసే ప్రదేశంగా మార్చారని విమర్శించారు. తాము నిర్మించిన వంతెనలపై నిలబడి ఫొటోషూట్లు చేస్తున్నారని, పరిపాలన కూడా సినిమా షూటింగ్‌లాగే సాగుతోందని స్టాలిన్ ఆరోపించారు. తన పాలనలోని లోపాలను దాచిపెట్టేందుకు ఇలాంటి రీల్స్, ప్రచార కార్యక్రమాలను ఉపయోగిస్తున్నారని అన్నారు.

MISA ప్రస్తావనపై స్టాలిన్ ఆగ్రహం

ఇటీవల అసెంబ్లీలో విజయ్ MISA చట్టాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ గతాన్ని గుర్తుచేశారు. తాను చేసిన చేతి సంజ్ఞ ఉద్దేశపూర్వకంగా కాదని విజయ్ వివరణ ఇచ్చారు. అయితే ఆ సంజ్ఞను 1976లో MISA కింద అరెస్టయిన సమయంలో స్టాలిన్ దవడకు తగిలిన గాయంతో పోల్చారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. ఎమర్జెన్సీ సమయంలో తాను ఎదుర్కొన్న పోరాటం డీఎంకే చరిత్రలో భాగమని చెప్పారు. చరిత్రను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

1976 ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్న స్టాలిన్

1976లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, MISA చట్టాన్ని నిరసిస్తూ డీఎంకే మెరీనా బీచ్‌లో భారీ సభ నిర్వహించిందని స్టాలిన్ గుర్తుచేశారు. 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిన వెంటనే, తనను MISA కింద అరెస్టు చేసేందుకు పోలీసులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారం కోసం బయట ఉన్నానని చెప్పారు. తన తండ్రి ఎం. కరుణానిధి పోలీసులతో మాట్లాడుతూ.. స్టాలిన్ మరుసటి రోజు తిరిగి వస్తారని, ఆయన వచ్చిన తర్వాత అరెస్టు చేయాలని చెప్పినట్లు స్టాలిన్ వివరించారు. తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులను పిలిచి తనను అరెస్టు చేయమని చెప్పారని తెలిపారు.

జైలులో ఎదుర్కొన్న హింసను వివరించిన స్టాలిన్

ఎమర్జెన్సీ సమయంలో MISA కింద స్టాలిన్‌ను నిర్బంధించారు. ఆయనతో పాటు మురసోలి మారన్, చిట్టిబాబు సహా పలువురు డీఎంకే నేతలు కూడా నిర్బంధానికి గురయ్యారని స్టాలిన్ పేర్కొన్నారు. జైలులో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ఖైదీలను అపరిశుభ్రమైన గదుల్లో ఉంచేవారని, పోలీసులు, ఇతర ఖైదీల చేతిలో దాడులకు గురయ్యామని చెప్పారు. ఆ సమయంలో తన దవడకు గాయాలయ్యాయని, వాటి గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు. డీఎంకే నేత, మాజీ మద్రాస్ మేయర్ చిట్టిబాబు జైలులో జరిగిన దాడుల అనంతరం మరణించారని కూడా స్టాలిన్ గుర్తుచేశారు.

‘నా పోరాట చరిత్రను చదవండి’

విజయ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు ఏమైనా అనుమానం ఉంటే నా పోరాట చరిత్రను చదవండి. అప్పుడు నిజం మీకు అర్థమవుతుంది’’ అని అన్నారు. తన జైలు జీవితం డీఎంకే సిద్ధాంతపరమైన చరిత్రలో భాగమని స్టాలిన్ పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై కాలం నుంచి డీఎంకే ఒక సిద్ధాంతపరమైన ఉద్యమంగా కొనసాగుతోందని చెప్పారు.

ప్రభుత్వం కమిషన్ అంశంపైనా ఎదురుదాడి

విజయ్ ప్రస్తావించిన ప్రభుత్వ కమిషన్, కరుణానిధిపై వచ్చిన ఆరోపణల అంశంపైనా స్టాలిన్ స్పందించారు. కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలో, తమిళనాడులో అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆరోపణల్లో నిజం ఉంటే ఇప్పటికే చర్యలు తీసుకునేవారని అన్నారు. రాజకీయ కక్షతోనే కరుణానిధిపై పాత ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని విజయ్‌పై విమర్శలు చేశారు. డీఎంకే నేతలపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీ లేఖలను అసెంబ్లీలో ప్రస్తావించడంపైనా స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకార చర్యలకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించండి’

అనేక మంది సీనియర్ నాయకులు నిర్మించిన అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని స్టాలిన్ సూచించారు. చట్టవ్యవస్థ, సంక్షేమం, తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరగాలని అన్నారు. ‘‘అసెంబ్లీలో అనవసర వివాదాల గురించి మాట్లాడవద్దని నా విజ్ఞప్తి’’ అని సీఎం విజయ్‌ను కోరారు.

‘సీఎంగా హుందాతనం ఉండాలి’

ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, ఆ పదవికి తగిన హుందాతనంతో మాట్లాడాలని సూచించారు. ‘‘ఒక ముఖ్యమంత్రి మాటల్లో, బాడీ లాంగ్వేజ్‌లో ముఖ్యమంత్రి స్థాయి హుందాతనం కనిపించాలి. మనం ప్రజలకు రోల్ మోడల్స్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.