Reading Time: 2 minutes

ఇప్పుడు బంగారంలో రూ.50వేలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Caption of Image.

ఇండియన్స్ దృష్టిలో బంగారాన్ని ఒక ఆభరణంగానే కాకుండా ఆర్థిక రక్షణ వలయంగా అత్యున్నత స్థానం ఉంది. ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలను తాకుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50వేలు పెట్టి బంగారం కొనుగోలు చేస్తే 10 ఏళ్ల తర్వాత 2036లో దాని విలువ ఎంత ఉండవచ్చనే అంశంపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. 

గడచిన దశాబ్ద కాలంలో బంగారం ధరలు అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. 2016లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.28వేల 623 ఉండగా, 2026 నాటికి అది రూ. లక్షా 53వేల 250కి చేరింది. సెప్టెంబర్ 7 నాటి ధరల ప్రకారం రూ. 50వేల పెట్టుబడికి సుమారు 3.26 గ్రాముల బంగారం వస్తుంది. అంటే గత పదేళ్లలో పసిడి ధర సుమారు 5.35 రెట్లు పెరిగి, దాదాపు 18.6 శాతం వార్షిక చక్రవడ్డీ రాబడిని అందించింది.

అయితే గత దశాబ్దపు 18.6 శాతం రాబడిని వచ్చే పదేళ్లకు ప్రామాణికంగా తీసుకోలేమని నిపుణులు అంటున్నారు. ఒకవేళ గత పరిస్థితులే రిపీట్ అయితే.. ఇప్పుడు పెట్టిన రూ.50వేల పెట్టుబడి 2036 నాటికి సుమారు రూ.2లక్షల 75వేలకు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం చారిత్రక లెక్కల ఆధారిత అంచనా మాత్రమే. ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లాంగ్-టర్మ్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ మోడల్ ప్రకారం.. 2025 నుంచి 2040 మధ్య బంగారం సగటు వార్షిక రాబడి 5.2 శాతంగా ఉండవచ్చని అంచనా. ఈ సంప్రదాయవాద అంచనా ప్రకారం చూస్తే రూ.50వేల గోల్డ్ పెట్టుబడి పదేళ్లలో సుమారు రూ.83వేలు కావచ్చు.

ALSO READ : ఆగస్టులో మారిన ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్.. గోల్డ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హవా..!

ఒకవేళ బంగారం మరింత మెరుగైన వృద్ధితో వార్షికంగా 8 శాతం రాబడిని ఇస్తే ఆ విలువ రూ.లక్షా 8వేలకు, 10 శాతం చొప్పున వృద్ధి చెందితే రూ.లక్షా 30వేలు కూడా చేరుకోవచ్చు. అలాగే 12 శాతం వార్షిక రాబడిని అందించినట్లయితే పెట్టుబడి విలువ సుమారు రూ. లక్షా 55వేలుగా మారుతుంది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు వంటి ప్రపంచ స్థాయి అంశాలు బంగారం ధరలను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. 

ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ, మేకింగ్ చార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు వాస్తవ రాబడిని కొంతమేర తగ్గిస్తాయి. కాబట్టి కేవలం పెట్టుబడి కోణంలో మాత్రమే ఆలోచించేవారు అదనపు ఖర్చులు లేని గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం మంచిది. మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి.

©️ VIL Media Pvt Ltd.