Reading Time: 2 minutes
Otr Ntv Telugu Andhra Pradesh Ap Politics 4

OTR: సిక్కోలు వైసీపీ పాడుతున్న రాగానికి, వేస్తున్న తాళానికి పొంతన లేకుండా ఉందా? కలిసి ఉంటే కలదు సుఖం, కలిసే స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొందామని పైకి చెబుతున్నా…క్షేత్ర స్థాయి వాస్తవం మాత్రం అలా లేదా? గ్రూప్‌వార్‌తో కాళ్ళు లాగేసే కార్యక్రమం దిగ్విజయంగా నడిచిపోతోందా? రోగం ఒకచోట ఉంటే… మందు మరోచోట వేస్తున్నారా? ఇంతకీ…. జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లాలో వైసిపి క్యాడర్ బలంగా ఉందిగానీ… లీడర్స్ మధ్య విభేదాలే పార్టీని గట్టి దెబ్బ కొడుతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఆధిపత్య పోరులో పార్టీని పణంగా పెడుతున్నారట. తమ ఇగోలతో తీవ్రంగా నష్ట చేస్తున్నారంటూ మండిపడుతోంది కేడర్‌. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాలవలస, రాజాం వంటి చోట్ల గ్రూపుల గోల బాగా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు…. గత ఎన్నికల్లో వైట్‌వాష్‌ అయినా… మా జిల్లా నాయకుల బుద్ధి మాత్రం మారలేదని సొంత కేడరే అసహనంగా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో… సంఘటితంగా ముందుకు వెళ్ళాల్సింది పోయి…గ్రూపులు కట్టి చేటుచేస్తున్నారని అంటున్నారు. ఇలాగైతే… ఎలా నెగ్గుకు రాగలమన్నది జిల్లా వైసిపి ద్వితీయ శ్రేణి నేతల క్వశ్చన్‌. అందుకే పార్టీలో టాప్‌ టు బాటమ్‌ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నారట. పార్టీకి చెడుచేసే వారు ఎంతటి వాళ్ళయినా ఆలోచించకుండా చర్యలు తీసుకుంటేనే గాడిన పడుతుందని అంటున్నారు. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కూటమి పార్టీలు మూడూ జిల్లాలో మంచి జోష్‌ మీదున్నాయి. మా పార్టీలో ఒకరిద్దరు సౌండ్‌ చేస్తున్నా… ఆ రేంజ్‌ మాత్రం కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలే అంటున్నారట. స్థానిక సమరంలో సత్తా చాటాలంటూ ఇటీవల ధర్మాన బ్రదర్స్ ఇన్ఛార్జ్‌లతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. వాళ్ళు చెప్పడం బాగానే ఉందిగానీ… గ్రౌండ్‌ లెవల్‌లో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. వివిధ నియెజకవర్గాల్లో స్థానిక నేతలు ఇన్ఛార్జ్‌లకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే… పార్టీ కోసం పనిచేసే వారికి మోకాలడ్డే పరిస్థితులు కూడా ఉన్నాయట. జిల్లాలో టిడిపి బలంగా ఉండటంతో పాటు అధికార పార్టీగా కొన్ని అడ్వాంటేజెస్‌ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో… ఇలాగే గుడ్డిగా ముందుకు వెళితే స్థానిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడక తప్పదని వైసీపీ కేడరే వార్నింగ్‌ ఇస్తోంది. ఇచ్చాపురంలో విజయసాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంప్రసాద్ రెడ్డి… ఇలా మూడు గ్రూప్స్‌ ఉన్నాయి. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మున్సిపల్ చైర్మన్ గిరిబాబు అంటీముట్టనట్లు ఉంటున్నారు. టెక్కలిలో పేరాడకు నేతల సహాయనిరాకరణ కొనసాగుతోంది. ఇక్కడ చాలా మంది ఇప్పటికీ ఎమ్మెల్సీ దువ్వాడతోనే టచ్‌లో ఉన్నారట. ఆమదాలవలసలో చింతాడ వర్సెస్ తమ్మినేని వార్‌ నడుస్తోంది. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి సైతం ఈ తలనొప్పి తప్పడం లేదట. ఇక్కడ మామిడి శ్రీకాంత్ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పచుకునే ప్రయత్నంసో ఉన్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్‌కు, ఆయన బావ మరిది సాయికుమార్‌కు పొసగటంలేదు. రాజాంలో మాజీ ఎమ్మెల్యే కంబాలజోగులు, ఇన్ఛార్జ్‌ తలే రాజేష్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇలా… దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అతుకుల బొంత రాజకీయమే నడుస్తోంది. కేడర్‌ చెక్కు చెదరకపోయినా…లీడర్స్‌ మధ్యన ఉన్న ఇలాంటి విభేదాలే వెనక్కి లాగుతున్నాయని అంటున్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం పార్టీలో విభేదాలు సృష్టించే వాళ్ళు సైతం ఉన్నారట. ఇప్పటికైనా వీటికి విరుగుడు కనిపెట్టకుంటే…స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది.