దేశంలో యూపీఐ ఎంత పాపులర్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రికార్డ్ స్థాయిలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. యూపీఐ రాకతో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోడం మరింత సులభమైంది. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా సెకన్లలోనే నిధులు బదిలీ చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్ చెకింగ్, పిన్ సెట్ చేసుకోవడం లాంటి సేవలు ఇందులో పొందవచ్చు.
అయితే చాలామందిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కూడా యూపీఐ లావాదేవీలు చేయవచ్చా అనే డౌట్ ఉంటుంది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం అందుబాటులోకి ఉంది. మరిన్ని దేశాలకు దీనిని వస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మీరు ఆ దేశాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. అయితే కొంతమొత్తంలో ఛార్జీలు పడతాయి.
మీరు విదేశీ చెల్లింపులు చేయాలంటే ముందుగా మీ యూపీఐ యాప్లో అంతర్జాతీయ చెల్లింపుల ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. మీరు పేమెంట్స్ చేయాల్సిన దుకాణంలో యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే ఆప్షన్ కలిగి ఉండాలి. దీంతో పేమెంట్స్ చేసేటప్పుడు ఒక్కసారి దుకాణాదారుడిని అడిగి చేయడం మంచిది. అలాగే ఛార్జీలను కూడా తనిఖీ చేసుకోవాలి.
మీరు విదేశీ కరెన్సీని రూపీలోకి మార్చుకున్నందుకు విదేశీ కరెన్సీ మార్పిడి ఖర్చు, బ్యాంక్ ఛార్జీలు ఉంటాయి. దీంతో మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఈ ఛార్జీలను పరిశీలించాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి అదనపు ఛార్జీల రూపంలో ఎంత కట్ అవుతుందనేది తనిఖీ చేసుకోండి. మీరు విదేశీ కరెన్సీ చార్జీలు ఉన్న ఫారెక్స్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఏది తక్కువ ఖర్చు అనేది పరిశీలించుకోండి
విదేశీ చెల్లింపులకు అదనపు రుసుంలు ఉంటాయని గూగుల్ పే తెలిపింది. అలాగే యూపీఐ యాప్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఎనేబేల్ చేసుకోవాలి. మీరు యూపీఐ సౌకర్యం ఉన్న అన్ని హోటళ్లు, దుకాణాల్లో చెల్లింపులు చేయవచ్చు. అయితే యూపీఐ యాప్లు యాక్టివేట్ చేసుకున్నాక 7 రోజుల పాటు గూగుల్ పేలో సేవలు పొందవచ్చు. ఆ తర్వాత మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలి.




