Reading Time: 2 minutes

చెంచుపెంటల్లో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి : మంత్రి సీతక్క

Caption of Image.
  •  అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్‌‌‌‌లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మిషన్ భగీరథ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపెంటలకు తాగునీటి సరఫరా జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. నల్లమల అడవుల్లో కేంద్ర పర్యావరణ చట్టాల ఆంక్షల వల్ల విద్యుత్ అనుమతులు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిషన్ భగీరథ నీటిని పంపింగ్ చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

అయినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెంచుపెంటలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సమస్యలు ఏవైనా చెంచులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి, ప్రతి చెంచుపెంటలో పర్యటించి అక్కడి తాగునీటి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈ లలిత, ఎస్ఈ హెచ్. జగన్మోహన్, ఈఈ కె. విజయసీ, ఏఈలు ఈ. సందీప్, ఎస్‌‌కే. అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని ఆదర్శ గ్రామం వెలిశాల సర్పంచ్ వీర్ల నర్సింగరావు, ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంతతోపాటు పాలకవర్గ సభ్యులు గురువారం అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌‌లో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆమె అభినందించి, శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వెలిశాల అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు.

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశాలను సర్పంచ్, వార్డు సభ్యులకు వివరించారు. గ్రామ పంచాయతీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించడం, నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల్లో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. సర్పంచులు, వార్డు మెంబర్లు సమన్వయంతో పనిచేసినప్పుడే పల్లెలు ప్రగతిబాట పడతాయని సూచించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.