
బాలీవుడ్ టాలెంటెడ్ నటి యామీ గౌతమ్ ధర్ మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె కథానాయికగా, ఆదినాథ్ కోఠారే ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘నయీ నవేలి’. ఫాంటసీ, హర్రర్, కామెడీ, మిస్టరీ అంశాల కలబోతగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టీజర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది.
మీరట్ నేపధ్యంలో సాగే ఓ విలక్షణమైన కుటుంబంలోకి అడుగుపెట్టే కొత్త కోడలు ‘మోహిని’పాత్రలో యామీ గౌతమ్ కనిపించనున్నారు. ఆమె రాకతో ఆ ఇంట్లో చోటుచేసుకునే వింత పరిణామాలు, నవ్వుల పువ్వులు పూయించే సంఘటనలు టీజర్‌లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మా వదిన 100% ర్యామ్‌సే బ్రదర్స్ రేంజ్ దెయ్యం’ అని బావమరిది ఆరోపించడం, దానికి యామీ ‘కేవలం ఒక దెయ్యమా? రెండు దెయ్యాలు, ముగ్గురు పిశాచాలు, నలుగురు భూతాలను నేను ఉదయమే టిఫిన్‌లా తినేస్తా’ అంటూ ఇచ్చే కౌంటర్ సీన్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
అసలు మోహిని నిజంగానే దెయ్యమా? లేక కుటుంబ సభ్యుల భయమే ఈ మిస్టరీకి కారణమా? అనే ప్రశ్న చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. చివర్లో యామీ నేరుగా ప్రేక్షకులను ఉద్దేశించి ‘THINK BIG’ అంటూ చెప్పడం టీజర్‌కు మరో హైలైట్‌గా నిలిచింది. ‘తను వెడ్స్ మను’ మార్కు వినోదం, ‘తుంబాడ్’ తరహా మిస్టరీని మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందించారు.
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక-నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, అమెజాన్ ఎమ్‌జీఎం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సునీతా రాజ్‌వర్, మీతా వశిష్ఠ్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.