Reading Time: 2 minutes

పోయిన క్రెడిట్ కార్డ్ నుంచి ఏవైనా పేమెంట్స్ జరిగితే ఆ డబ్బు ఎవరు కట్టాలి..? RBI రూల్స్ ఇవే..

Caption of Image.

పొరపాటున మీ క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా.. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరిగితే ఆ మొత్తానికి ఎవరు బాధ్యులు అనేది చాలా మందికి ఉండే అనుమానం. అయితే కార్డ్ మిస్ అయినట్లు బ్యాంకుకు ఎప్పుడు రిపోర్ట్ చేశారనే దానిపై బాధ్యత ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు పోయిన వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా దాన్ని బ్లాక్ చేయడం, ఫ్రీజ్ చేయడం అన్నిటికంటే ముఖ్యం. ఒకవేళ కార్డు బ్లాక్ చేసేలోగా ఎవరైనా లావాదేవీలు నిర్వహిస్తే.. ఆ డబ్బు ఎవరు కట్టాలనేది పూర్తిగా మోసం ఎలా జరిగింది, బ్యాంకుకు ఎప్పుడు సమాచారం అందించారనే అంశాలపై ముడిపడి ఉంటుంది. కార్డును పోగొట్టుకున్నట్లు బ్యాంకుకు తెలియజేసి దాన్ని బ్లాక్ చేయించిన తర్వాత జరిగే ఏ అనధికారిక లావాదేవీకైనా సాధారణంగా బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

బ్యాంకుకు సమాచారం అందించడానికి ముందు జరిగిన లావాదేవీల విషయంలో వినియోగదారుడి బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు, ఆయా బ్యాంకుల కస్టమర్ సేఫ్టీ పాలసీల ద్వారా నిర్ణయిస్తారు. బ్యాంకు వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకపోయినా, థర్డ్ పార్టీ వల్ల వ్యవస్థలో లోపం తలెత్తి మోసం జరిగితే కస్టమర్ బాధ్యత సున్నా. అయితే దీనికోసం లావాదేవీ జరిగిన వివరాలు అందిన తర్వాత 3 రోజుల్లోపు కస్టమర్ బ్యాంకుకు తెలియజేయాలి. ఒకవేళ 3 పని దినాలలోపు ఫిర్యాదు చేస్తే వినియోగదారుడు ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఆ మొత్తాన్ని బ్యాంకే భరిస్తుంది. ఈ గడువు దాటితే మాత్రం కస్టమర్లపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

4 నుంచి 7 పని దినాలలోపు రిపోర్ట్ చేస్తే రూ.5 లక్షల వరకు పరిమితి ఉన్న కార్డులకు ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10వేల వరకు, అంతకంటే ఎక్కువ లిమిట్ ఉన్న కార్డులకు రూ.25వేల వరకు బాధ్యత వర్తిస్తుంది. ఒకవేళ 7 పని దినాలు దాటిన తర్వాత సమాచారం అందిస్తే.. ఆ నష్టాన్ని భరించే బాధ్యత పూర్తిగా బ్యాంకు ఆమోదించిన పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ గడువు కార్డు పోయిన రోజు నుంచి కాకుండా, బ్యాంకు నుంచి లావాదేవీకి సంబంధించిన సమాచారం అందిన రోజు నుంచి లెక్కించబడుతుంది. అయితే ఈ మోసం పూర్తిగా బ్యాంకు వైపు జరిగిన పొరపాటు, నిర్లక్ష్యం వల్ల జరిగితే మాత్రం వినియోగదారుడికి ఎటువంటి సంబంధం ఉండదు. 3 రోజుల నిబంధనతో సంబంధం లేకుండా కస్టమర్ పై బాధ్యత సున్నా. 

OTP, PIN లేదా ఇతర క్రెడియెన్షియల్స్ ఎవరితోనైనా పంచుకోవడం వంటి కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే, ఆ సంఘటనను బ్యాంకుకు నివేదించే వరకు అయిన నష్టాన్ని వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ క్రెడిట్ కార్డుపై ‘లాస్ట్ కార్డ్ కవర్’ ఇన్సూరెన్స్ ఉంటే.. అది కొన్ని నిబంధనలకు లోబడి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియతో సంబంధం లేకుండా.. బ్యాంకులు మాత్రం నోటీసు అందిన 10 పని దినాలలోపు ప్రొవిజనల్ రివర్సల్ మొత్తాన్ని అందించాల్సిందే. ఈ వివాదాలు పరిష్కారమయ్యే వరకు వివాదాస్పద మొత్తాన్ని చెల్లించమని ఒత్తిడి చేయడం, దానివల్ల సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా చూసుకోవడం వంటి విషయాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, CVV వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకపోవడమే బెస్ట్. 

©️ VIL Media Pvt Ltd.