Reading Time: < 1 minute
Pawan Kalyan: కేరళ నుంచి తిరిగొస్తూ.. ఎమోషనలైన పవన్ కల్యాణ్.. ఎందుకంటే?

కేరళలో చికిత్స అనంతరం ఏపీకి బయల్దేరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎమోషనల్ అయ్యారు. ఆయనకు అక్కడ లభించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంటూ ఆయన వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాగానికి ధన్యవాదాలు తెలిపారు. ముంబైలో భుజానికి శస్త్రచికిత్స అనంతరం చికిత్స కొనసాగింపుగా కేరళలోని డాక్టర్ సీతారామ్ ఆయుర్వేదిక్ రిట్రీట్‌లో పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకున్నారు. దాదాపు 21 రోజుల పాటు సాగిన ఈ చికిత్స సమయంలో కేరళ ప్రజల ఆప్యాయత, ఆదరణ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు ఇది కేవలం చికిత్స కాలం మాత్రమే కాదని.. స్వస్థత, ప్రశాంతత, మధుర జ్ఞాపకాల సమయమని తెలిపారు.

నాలుగు ఆలయాల దర్శనం

కేరళలో ఉన్న సమయంలో త్రిప్రయార్ శ్రీరామస్వామి, గురువాయూర్ శ్రీకృష్ణ, మమ్మియూర్ శ్రీ మహాదేవ్, చెట్టికుళంగర శ్రీ భగవతి అమ్మ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర, సంప్రదాయాలతో ఉన్న ఈ ఆలయాల్లో దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, భక్తి భావాన్ని అందించిందని చెప్పారు. కేరళ ఆలయాలు మన ప్రాచీన నాగరికత వారసత్వానికి సజీవ ప్రతిరూపాలని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు.

ప్రభుత్వం, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు

తన పర్యటన సజావుగా సాగేందుకు సహకరించిన కేరళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, డీజీపీ, కేరళ పోలీసు బృందాలు, త్రిశూర్, అలప్పుజ, కొచ్చి జిల్లా యంత్రాంగాలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. స్టేట్ ప్రోటోకాల్ విభాగం అందించిన సహకారం, ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి దశలోనూ భద్రత, సౌకర్యాల విషయంలో చూపిన వృత్తిపరమైన శ్రద్ధను అభినందించారు.

థ్యాంక్యూ కేరళ..

అన్నింటికంటే ముఖ్యంగా కేరళ ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల ఆప్యాయత, కేరళ ఆధ్యాత్మిక వారసత్వం, అసాధారణ ఆతిథ్యం తన బసను ఎంతో ప్రత్యేకంగా మార్చాయని చెప్పారు. లోతైన కృతజ్ఞత, అపారమైన గౌరవం, ఎన్నో మధుర జ్ఞాపకాలతో కేరళ నుంచి వెళ్తున్నానని.. థ్యాంక్యూ కేరళ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.