Reading Time: 3 minutes
Saudi Crown Prince Trump Houthi Strikes Us Refuses Military Action

ఇటీవల పాకిస్థాన్‌, టర్కీతో సౌదీ మక్కా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు కలిపి దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ప్రస్తుతం సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. సౌదీకి చెందిన సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సౌదీకి అండగా నిలబడి.. హౌతీలపై దాడి చేయాల్సిన పాకిస్థాన్ తోక ముడిచింది. తనకేమీ పట్టనట్టుగా దూరం జరిగింది. దీంతో చేసేదేమీ లేక సౌదీ.. అమెరికాను ఆశ్రయించింది. హౌతీలపై దాడి చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కోరారు. దాదాపు రెండు సార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఊహించని విధంగా సౌదీ విజ్ఞప్తిని ట్రంప్ తిరస్కరించారు. ఈ మేరకు అమెరికా అధికారులు చెప్పినట్లుగా ఆక్సియోస్ పేర్కొంది.

ఇరాన్, హార్ముజ్ జలసంధిపై అమెరికా సైనిక దృష్టి కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్‌లో మరో యుద్ధరంగాన్ని తెరవడానికి వాషింగ్టన్ ఇష్టపడటం లేదని సమాచారం. ప్రస్తుతం అమెరికా దళాలను.. ఇరాన్, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపైనే కేంద్రీకరించాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌కు రెండుసార్లు ఫోన్

గురువారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్.. ట్రంప్‌కు రెండుసార్లు ఫోన్ చేసినట్లు ఆక్సియోస్ తెలిపింది. తొలిసారి యెమెన్‌లో దిగజారుతున్న పరిస్థితిపై ట్రంప్‌కు వివరించారు. హౌతీ దళాలు ఎర్ర సముద్ర తీరంలోని కీలక నగరం మోఖా వైపు ముందుకు సాగుతుండగా.. సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వ దళాలు వెనక్కి తగ్గుతున్న పరిస్థితిని ఆయన వివరించినట్లు సమాచారం. కొన్ని గంటల తర్వాత మరోసారి ట్రంప్‌కు ఫోన్ చేసి.. హౌతీ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ అందుకు అంగీకరించలేదని పేర్కొంది.

జూలైలో సౌదీ వైఖరి వేరు..

హౌతీల విషయంలో సౌదీ అరేబియా వైఖరిలో మార్పు వచ్చినట్లు ఈ పరిణామం సూచిస్తోంది. గత జూలైలో సౌదీ అధికారులు అమెరికాకు తమకు హౌతీలను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని, నేరుగా అమెరికా సైనిక జోక్యం అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. అప్పట్లో సనా విమానాశ్రయంపై సౌదీ దాడి చేసే అవకాశం గురించి ట్రంప్ రాజకీయ మద్దతును కోరినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రత్యక్ష సైనిక సహాయం అవసరం లేదని రియాద్ స్పష్టం చేసింది. ఆ సమయంలో ట్రంప్ సౌదీ వైఖరికి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం యెమెన్‌లో పరిస్థితి మరింత తీవ్రం కావడంతో రియాద్ అమెరికా నుంచి ఎక్కువ సహాయాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌పైనే అమెరికా దృష్టి

అమెరికా సైనిక, పౌర అధికారులు సౌదీ ప్రతినిధులకు ట్రంప్ ప్రస్తుత ఆదేశాలను స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరాన్, హార్ముజ్ జలసంధిపైనే అమెరికా దళాల దృష్టి కొనసాగాలని, యెమెన్‌లో మరో ప్రత్యక్ష సైనిక పోరులోకి వెళ్లకూడదన్నదే ప్రస్తుత విధానమని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ గురువారం సౌదీ అరేబియాకు వెళ్లి అత్యవసర చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే సౌదీకి అమెరికా పూర్తిగా దూరంగా ఉండబోదని తెలుస్తోంది. హౌతీ దళాల కదలికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్, టార్గెటింగ్ సమాచారాన్ని రియాద్‌కు అందించాలని అమెరికా నిర్ణయించినట్లు ఆక్సియోస్ పేర్కొంది. ఇప్పటికే సుమారు 200 మంది అమెరికా సైనికులు సౌదీలో నాన్-కాంబాట్ సహాయక విధుల్లో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఎర్ర సముద్రంలో..

ట్రంప్‌ ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి ప్రకారం.. హౌతీలతో ప్రత్యక్ష పోరులోకి దిగడం కంటే ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం అమెరికా తక్షణ ప్రాధాన్యం. ప్రాంతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో భాగస్వామ్య దేశాలకు నాయకత్వం వహించే అవకాశం కల్పిస్తూ.. తమ కీలక జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటంపై అమెరికా దృష్టి పెట్టిందని ఆ అధికారి పేర్కొన్నారు.

కీలక నగరాలపై హౌతీల పట్టు?

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ దళాలు యెమెన్‌లోని మోఖా పోర్టు నగరాన్ని స్వాధీనం చేసుకుని, ఎర్ర సముద్ర తీరం వెంట వ్యూహాత్మక దీవుల వైపు ముందుకు సాగినట్లు సైనిక వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే బాబ్ అల్-మందబ్ జలసంధి సుమారు 25 కిలోమీటర్లకు కుంచించుకునే కీలక ప్రాంతమైన హిస్న్ మురాద్పై కూడా హౌతీలు పట్టు సాధించినట్లు సమాచారం. మోఖాతో పాటు ధుబాబ్, జుకర్ దీవులను కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. బాబ్ అల్-మందబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఇది ఒకటి.

రెండు జలసంధుల్లో సమస్య వస్తే..

బాబ్ అల్-మందబ్‌లో నౌకాయానాన్ని హౌతీలు అడ్డుకోగలిగితే.. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న హార్ముజ్ జలసంధికి మరో కీలక ప్రత్యామ్నాయ ఒత్తిడి కేంద్రం ఏర్పడే అవకాశం ఉంటుంది. హార్ముజ్, బాబ్ అల్-మందబ్.. రెండు కీలక సముద్ర మార్గాల్లోనూ నౌకాయానానికి అంతరాయం ఏర్పడితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

సౌదీ చమురు ఉత్పత్తి భారీగా తగ్గింది

ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి మరోసారి భారీగా పడిపోయింది. గత నెలలో రోజుకు 62.38 లక్షల బ్యారెళ్లకు తగ్గినట్లు OPECకు సౌదీ తెలిపింది. 1990 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి అని నివేదికలు పేర్కొన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సౌదీ చమురు ఎగుమతి మార్గాలపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. సౌదీ తూర్పు-పడమర క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌కు పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.

బ్యారెల్ చమురు ధర 108 డాలర్లకు

మరోవైపు పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరలపై కనిపిస్తోంది. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరింది. అమెరికా WTI క్రూడ్ కూడా దాదాపు 1 శాతం పెరిగి 103.45 డాలర్ల వద్ద ట్రేడయింది. అమెరికాలో డీజిల్ సగటు ధర తొలిసారి గ్యాలన్‌కు 6 డాలర్లను దాటినట్లు రైయిటర్స్‌ను ఉటంకిస్తూ నివేదికలు తెలిపాయి.