
శ్రీనగర్: జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) మధ్య విభేదాలు నెలకొన్నాయి. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పూర్తి జాతీయ గేయాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంపూర్ణ వందేమాతరానికి గౌరవంగా లేచి నిలబడగా, మిత్రపక్షమైన కాంగ్రెస్ తప్పుపట్టింది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకుముందులాగానే వందేమాతర గేయం తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలనే ఎన్సీ నేతలను కోరారు.
ఏం పాడాలో శాసించలేరు: ఎన్సీ
సంపూర్ణ వందేమాతరం దేశ భిన్నత్వ భావనకు విరుద్ధమని, గాంధీజీ, నెహ్రూ, పటేల్‌లాంటి స్వాతంత్ర్య సమరయోధుల నిర్ణయాలకు తగ్గట్టుగా కేవలం మొదటి రెండు చరణాలనే ఆలపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’ వేదికగా హితవు పలికారు. నాగ్‌పూర్ (ఆర్ఎస్ఎస్) ఒత్తిళ్లకు తలొగ్గొద్దని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అంతే ఘాటుగా స్పందించింది.
కూటమిలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన ‘‘ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి” అనే విషయాన్ని కాంగ్రెస్ శాసించలేదని ఎన్‌సీ నేత బషీర్ అహ్మద్ తేల్చిచెప్పారు. కాగా, సంపూర్ణ గేయాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ 21వ శతాబ్దపు నూతన ‘ముస్లిం లీగ్’గా రూపాంతరం చెందిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు.