
Botsa Satyanarayana Emotional: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు.. విజయనగరం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తదితరులు హాజరయ్యారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిన్న శ్రీను పార్టీ మార్పుతో ప్రాధాన్యత
ఇటీవల చిన్న శ్రీను పార్టీ మారిన నేపథ్యంలో విజయనగరం జిల్లా వైసీపీ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై సమావేశంలో పలువురు నేతలు స్పందించారు. పార్టీకి అండగా నిలవాలని, కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.0 కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ ఏర్పాటు సమయంలో నాయకులను మాత్రమే నమ్మలేదని, వైఎస్సార్ అభిమానులు, ప్రజలను నమ్మి పార్టీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని అమర్‌నాథ్ విమర్శించారు. అయితే బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగే అధికారులపై వ్యాఖ్యలు చేస్తూ.. ప్రస్తుతం లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని వ్యాఖ్యానించారు.
బొత్స ఓ రాజకీయ విశ్వవిద్యాలయం
ఇక, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయమని గుడివాడ అమర్‌నాథ్ అభివర్ణించారు. ఆయన ఎంతోమందిని సర్పంచుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దిన చరిత్ర ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బొత్సకు అండగా నిలవాలని సూచించారు. ఇదే సమయంలో.. సమావేశంలో చిన్న శ్రీను పార్టీ మారిన అంశంపై గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతుండగా బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
భావోద్వేగానికి గురైన బడ్డుకొండ అప్పలనాయుడు
ఇదే సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన బావమరిది చిన్న శ్రీను పార్టీ మారడం, దాని ప్రభావం తనపై పడుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అందించిన సహకారం కారణమని బడ్డుకొండ అప్పలనాయుడు గుర్తుచేశారు. వారికి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.