Reading Time: < 1 minute
Victims Staged A Protest In Front Of A Distributors House Alleging Fraud Under The Pretext Of Offering Film Opportunities

సినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌లలో నటింపజేస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.  తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అంబర్‌పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. బాధితులు ఒక్కసారిగా నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

బాధితుల కథనం ప్రకారం.. గత మూడేళ్లుగా శ్రీరామ్‌, శివకుమార్, లావణ్య అనే వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అవకాశాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించారు. తమకు టాలీవుడ్ లో  చాలా పరిచయాలు ఉన్నాయని సినిమాల్లో మంచి పాత్రలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు 25 మంది మహిళలతో పాటు పలువురి నుంచి మొత్తంగా కోట్ల రూపాయలు దండుకుని కొన్నాళ్లుగా అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని, అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్ శివను బయటకు పిలిచి మాట్లాడించాలని, తమకు రావాల్సిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు.