Reading Time: 2 minutes
Tilak Varma Test Cricket Dream India Star Reveals Big Goal

Tilak Varma on Test Cricket: భారత యువ బ్యాటర్‌, తెలుగు ప్లేయర్ తిలక్‌ వర్మకు టెస్టు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ముందుగా టెస్టు క్రికెట్‌ ఆడి, ఆ తర్వాత వైట్‌బాల్‌ క్రికెట్‌లోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. అయితే అతడి లక్ష్యంకు బిన్నంగా.. తిలక్ ముందుగా వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. మనోడు ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఇప్పుడు టీమిండియాలో ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. తన చిన్నప్పటి కల నెరవేరనందుకు కాస్త బాధగా ఉందని చెప్పాడు. దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్లో 99 పరుగుల వద్ద ఔటైన అనంతరం తిలక్‌ తన మనసులోని మాటలను పంచుకున్నాడు.

సౌత్‌ జోన్‌ తరఫున ఆడుతున్న తిలక్‌ వర్మ 211 బంతుల్లో 99 పరుగులు చేసి శతకానికి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. ఎండీ కునైన్‌ ఖురేషీకి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు 583 బంతుల పాటు అతడు ఔట్‌ కాలేదు. ఇంగ్లండ్‌తో జులై ఆరంభంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా ఔటైన తిలక్‌.. ఆ తర్వాత దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో 116 నాటౌట్‌, 51 నాటౌట్‌ వంటి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే 99 పరుగుల వద్ద అవుట్ అయినా తిలక్‌ పెద్దగా బాధపడలేదు.

‘ఫలితం ఈస్ట్ జోన్‌ వైపు వెళ్లింది. అలాంటప్పుడు నేను సెంచరీ చేశానా లేదా నాటౌట్‌గా నిలిచానా అనేది నాకు ముఖ్యం కాదు. కష్టపడి ఆడినందుకు సెంచరీ ఒక గుర్తింపుగా ఉండేది. కానీ క్రికెట్‌ విచిత్రమైన ఆట. తర్వాతి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు’ అని తిలక్‌ వర్మ చెప్పాడు. రెడ్‌బాల్‌ క్రికెట్‌ తన రక్తంలోనే ఉందని తిలక్‌ మరోసారి స్పష్టం చేశాడు. ‘నా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కెరీర్‌ను రెడ్‌బాల్‌ క్రికెట్‌తోనే ప్రారంభించాను. ఎన్నో సంవత్సరాలు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడాను. అది ఎప్పుడూ నా ఫేవరెట్‌ గేమ్‌. అదే నా ఏ-గేమ్‌. అయితే గత ఐదారు సంవత్సరాలుగా వైట్‌బాల్‌ క్రికెట్‌ ఎక్కువగా ఆడుతున్నాను’ అని వివరించాడు.

భారత్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటం తన అతిపెద్ద లక్ష్యమని తిలక్‌ వర్మ వెల్లడించాడు. ‘నేను అందరికీ ఎప్పుడూ ఒకటే చెబుతుంటాను. భారత్‌ తరఫున రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడాలనేది నా లక్ష్యం. నాకు రెడ్‌బాల్‌ క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ముందుగా టెస్టు క్రికెట్‌ ఆడతానని, ఆ తర్వాత వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడతానని అనుకునేవాడిని. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌ ముందుగా ఆడాను. అందుకు సంతోషమే కానీ.. నా కల నెరవేరనందుకు బాధగా కూడా ఉంది. భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ కూడా ఆడుతా’ అని తిలక్‌ ధీమా వ్యక్తం చేశాడు.

నాయకత్వ అనుభవం కూడా తన ఆటను మెరుగుపరుస్తోందని తిలక్‌ వర్మ తెలిపాడు. గతంలో భారత్‌-ఎ జట్టుకు వైట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన అతడు.. ప్రస్తుతం దులీప్‌ ట్రోఫీ 2026లో సౌత్‌ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా భారత టీ20 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్సీ ద్వారా ఆటగాళ్లను మైదానం వెలుపల అర్థం చేసుకోవడం, ఒత్తిడిలో వారిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నానని చెప్పాడు. ‘కెప్టెన్‌గా ఉండటంలో ముఖ్యమైన విషయం ఆటగాళ్లను త్వరగా అర్థం చేసుకోవడం. మైదానం వెలుపల వారితో మాట్లాడినప్పుడు వారు ఎలాంటి వ్యక్తులో తెలుస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిలో వారిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. ఒక కెప్టెన్‌కు ఏ ఆటగాడిని ఏ సమయంలో ఉపయోగించాలన్నది చాలా కీలకం. అందుకోసం వారితో సమయం గడపడం ఎంతో అవసరం’ అని తిలక్‌ పేర్కొన్నాడు.

దులీప్‌ ట్రోఫీ ముగిసిన వెంటనే తిలక్‌ వర్మ తిరిగి వైట్‌బాల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్‌ 13 నుంచి భారత్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. రెడ్‌బాల్‌ నుంచి వైట్‌బాల్‌కు, దేశవాళీ క్రికెట్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు తక్కువ సమయంలో మారాల్సి రావడం సవాలేనని తిలక్‌ అంగీకరించాడు. ‘ఇది అంత సులభం అని చెప్పను. అయితే మాకు రెండు రోజుల ప్రాక్టీస్‌ సమయం ఉంది. తగినంత ప్రాక్టీస్‌ చేసినప్పుడు దేశవాళీ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు, రెడ్‌బాల్‌ నుంచి వైట్‌బాల్‌కు మారేటప్పుడు మన మైండ్‌సెట్‌ను కూడా మార్చుకోవచ్చు. రెండు రోజుల ప్రాక్టీస్‌ సరిపోతుందనే నమ్మకం నాకు ఉంది’ అని తిలక్‌ చెప్పుకొచ్చాడు.