Reading Time: < 1 minute
This Is Unfair Dc Filmmakers Are Ignoring Vamikagabbi

తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన ‘డీసీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాత కళానిధి మారన్.. చిత్ర దర్శకుడు అరుణ్ మథేశ్వరన్, అలాగే  ఈ సినిమా ద్వారా నటుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు.

అందుకు సంబంధించిన వీడియోలను సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. గతంలో ‘జైలర్’ సినిమా భారీ హిట్ సాధించిన సమయంలో కూడా నిర్మాత కళానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ‘డీసీ’ యూనిట్‌కు కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వామికా గబ్బీ పెర్‌ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో ఎంతో కీలక పాత్ర పోషించిన వామికా గబ్బీకి ఎలాంటి బహుమతి లేదా అంటూ నెటిజన్లు మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. “హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కే కార్లు ఇచ్చారు.. సినిమా విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హీరోయిన్‌కు కనీసం ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వాల్సింది కదా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. లేడీ యాక్టర్లను ఇలా పక్కన పెట్టడం పట్ల సన్ పిక్చర్స్ తీరుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.