Reading Time: 2 minutes

AIకి అసలు నీళ్లెందుకు..? సముద్రాలు ఎండిపోయేలా డేటా సెంటర్లు చేస్తున్నాయా?

Caption of Image.

AIతో మన పనులను చిటికెలో చేసిపెడుతుండవచ్చు. కానీ తెరవెనుక జరుగుతున్న విధ్వంసం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. క్షణాల్లో అందమైన ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసే ఏఐ మోడల్స్ కేవలం కరెంటునే కాదు, వేల కోట్ల లీటర్ల నీటిని సైతం ఇట్టే మింగేస్తున్నాయి. ‘ఏఐకి అసలు నీళ్లెందుకు?’ అనే అనుమానం మనలో చాలా మందికి రావడం సహజమే. ఈ పనులు పూర్తి చేసేందుకు నిరంతరం పనిచేసే టెరాబైట్ల కొద్దీ సర్వర్లు, వేల సంఖ్యలో ఉండే ఏఐ చిప్స్ విపరీతంగా వేడెక్కుతాయి. ఆ భారీ యంత్రాలను చల్లబరచడానికి డేటా సెంటర్లకు లక్షలాది లీటర్ల నీరు అత్యవసరం.

ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ అంచనాల ప్రకారం.. 2030 నాటికి కేవలం ఏఐ డేటా సెంటర్ల ద్వారా జరిగే నీటి వినియోగం ఏకంగా 9లక్షల 30వేల లీటర్లకు చేరుకుంటుంది. ఇది సబ్-సహారా ఆఫ్రికాలోని దాదాపు 13 కోట్ల మంది ప్రజల వార్షిక దేశీయ నీటి అవసరాలతో సమానం. ఒక్క సాధారణ ఏఐ ఇమేజ్ తయారీకి దాదాపు 29 మి.లీ నీరు ఖర్చవుతుండగా, కాంప్లెక్స్ వీడియోల తయారీకి 4 లీటర్ల కొద్దీ నీరు ఆవిరైపోతోంది. ఒక్కసారి కూలింగ్ కోసం వాడిన నీరు మళ్లీ వినియోగించడానికి వీలులేకుండా కలుషితమవుతుండటం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది.

టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు తమ డేటా సెంటర్ల కోసం స్థానిక జల వనరులను విపరీతంగా తోడేస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోని కొన్ని నగరాల్లో ఈ డేటా సెంటర్ల దాహానికి త్రాగునీటి సరఫరా సైతం దెబ్బతింటోందట. నదులు, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఐ అభివృద్ధి వేగం పెరిగేకొద్దీ.. ఈ నీటి వినియోగం కూడా భూమికి పెను భారంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ ; రూ.2వేల500 జీతం నుంచి రూ.6 కోట్ల సామ్రాజ్యం

ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలు, గ్లోబల్ వార్మింగ్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో.. ఏఐ దాహం సముద్రాలను కూడా ఎండగట్టేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎంత పెరిగినా, వాడకం కూడా విపరీతంగా పెరగడం వల్ల ఈ జల సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. టెక్నాలజీ భవిష్యత్తు కోసం మనుషుల దాహం తీర్చే నీటిని పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

©️ VIL Media Pvt Ltd.