స్టవ్ పై వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకుని, అరకప్పు మంచి నాణ్యత గల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక, రెండు కప్పుల సత్తు పిండిని వేసి, మంటను లో ఫ్లేమ్ లో ఉంచి బాగా కలపాలి. సత్తును ఇప్పటికే వేయించి తయారు చేస్తారు కాబట్టి, ఎక్కువసేపు వేయించకూడదు. 5 నుండి 10 నిమిషాల పాటు, పిండి చక్కగా వేడెక్కే వరకు మాత్రమే వేయించాలి. సున్నుండలు వేయించినప్పుడు వచ్చే కమ్మటి వాసన వచ్చినప్పుడు, పిండి ముద్దలా కాకుండా ఫ్లఫీగా తయారవుతుంది. ఆ సమయంలో పిండిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
అటుకులను వేయించుకోవాలి: ఇప్పుడు అదే పాన్ లో అరకప్పు అటుకులు వేసి, నెయ్యి లేకుండానే మంటను లో ఫ్లేమ్ లో ఉంచి, కరకరలాడేంత క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించాలి. అయితే, మీరు మాడిపోకుండా చూసుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇదే పాన్ లో రెండు కప్పుల ఫూల్ మఖానా ను వేసి, మంటను లో ఫ్లేమ్ లో ఉంచి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి, పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా వేయించి చల్లార్చిన అటుకులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన సత్తు పిండిలో ఈ అటుకుల పొడిని వేసి బాగా కలపాలి. వేయించి చల్లార్చిన ఫూల్ మఖానా ను కూడా మిక్సీలో వేసి చాలా మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా సత్తు, అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
తీపి కోసం బెల్లం పొడి, పటికబెల్లం పొడి, పంచదార పొడిని ఉపయోగించవచ్చు. ఇక్కడ పటికబెల్లం పొడిని వాడారు. పటికబెల్లం గట్టిగా ఉంటే, మిక్సీలో వేసే ముందు చిన్న ముక్కలుగా దంచుకోవాలి. తయారుచేసుకున్న పటికబెల్లం పొడిని అరకప్పు వరకు, రుచికి తగినంతగా, మిశ్రమంలో కలుపుకోవాలి. తీపిని కలిపేటప్పుడు మిశ్రమం పూర్తిగా చల్లారి ఉండటం ముఖ్యం. ముందుగా కొద్దిగా వేసి కలిపి, రుచి చూసి, అవసరమైతే మిగతా పొడిని కలుపుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఎలాంటి పాకం పట్టే పని లేకుండా సులభంగా తయారు చేసుకునే ఈ లడ్డూలు 10 రోజుల వరకు బయటే నిల్వ ఉంటాయి. ఇవి సున్నుండల రుచితో పాటు కొద్దిగా మైసూరుపాక్ రుచిని కూడా కలిగి ఉంటాయి. పిల్లలకు ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ టేస్టీ లడ్డూలు బలవర్ధకమైన చిరుతిండిగా ఉపయోగపడతాయి.




