
IND vs AFG 1st T20: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న తొలి సమరంలో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు సంజు శాంసన్, నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వస్తుండటంతో తుది జట్టు (Playing XI) కలయికపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
సంజు వర్సెస్ ఇషాన్.. కెప్టెన్ అయ్యర్ బిగ్ ట్విస్ట్:
వికెట్ కీపర్ స్థానం కోసం సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇస్తారా లేక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరినీ తుది జట్టులో ఆడిస్తాడా అనేది సస్పెన్స్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉండగా.. శాంసన్‌ను మూడో స్థానంలో, ఇషాన్ కిషన్‌ను నాల్గో స్థానంలో ఆడించడం వలన టాప్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసేలా అయ్యర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఆ తర్వాత 5, 6 స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానున్నారు.
దూబేపై వేటు.. యంగ్ ఆల్‌రౌండర్‌కు ఛాన్స్:
ఇటీవలి మ్యాచ్‌ల్లో శివమ్ దూబే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జోడీగా రానుండగా, పేస్ బౌలింగ్ రంగాన్ని జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడిపించబోతున్నారు. ఈ కలయికతో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనిపిస్తోంది.
రికార్డుల్లోనూ తిరుగులేని ఆధిపత్యం:
ఆఫ్ఘనిస్తాన్‌పై అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20ల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 9 సార్లు తలపడగా.. 8 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. వన్డేల్లో 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించింది. టెస్టుల్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఢిల్లీలో బోణీ కొట్టడమే లక్ష్యం:
ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ తొలి పోరులో విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో భారత్ పవర్ -ప్యాక్డ్ హెవీ బ్యాటింగ్ లైనప్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
టీమిండియా ప్లేయింగ్ XI:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్ ), నితీశ్ కుమార్ రెడ్డి (పేస్ ఆల్‌రౌండర్), అక్షర్ పటేల్(స్పిన్ ఆల్‌రౌండర్) , వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్