
జగిత్యాల టౌన్, వెలుగు: వినాయక చవితి సందర్భంగా పంపిణీ చేయాల్సిన మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త వాహనంలో తరలించడం వివాదం రేపింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెట్పల్లికి ఉచితంగా పంపిణీ చేసేందుకు మట్టి వినాయక విగ్రహాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే ఆ విగ్రహాలను మున్సిపల్ చెత్త రవాణా వాహనంలో ఎక్కించి తరలిస్తుండడాన్ని గమనించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పవిత్రమైన విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనకు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.