Reading Time: 2 minutes
Wasim Akram Questions Psl Over Lack Of Young Batting Talent

Wasim Akram: IPLలో ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటారు.. ఆ తర్వాత క్రమంగా టీమిండియా వైపు అడుగులు వేశారు.. యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీయడానికి భారత్‌కు ఐపీఎల్‌ ఎంతగానే ఉపయోగపడింది.. అయితే, IPL తరహాలో పాక్‌ కూడా PSL నిర్వహిస్తోన్న విషయం విదితమే.. కాగా.. పాకిస్థాన్ క్రికెట్‌లో యువ బ్యాటింగ్ ప్రతిభ కొరతపై మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల భారత యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా చూపుతూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై కీలక ప్రశ్నలు సంధించారు.

పీఎస్‌ఎల్‌కు పదేళ్లు.. అయినా బ్యాటింగ్ ప్రతిభ ఎక్కడ?
లాహోర్‌లో మీడియాతో మాట్లాడిన వసీం అక్రమ్.. పీఎస్‌ఎల్ ప్రారంభమై దాదాపు పదేళ్లు పూర్తయినా, పాకిస్థాన్ జట్టుకు ఎక్కువ కాలం సేవలందించే స్థాయి బ్యాట్స్‌మెన్‌ను ఈ లీగ్ ఎందుకు తయారు చేయలేకపోయిందని ప్రశ్నించారు. పీఎస్‌ఎల్ ద్వారా పాకిస్థాన్‌కు కొంతమంది మంచి బౌలర్లు లభించారని అక్రమ్ అంగీకరించారు. అయితే అదే స్థాయిలో బ్యాటింగ్ ప్రతిభ వెలుగులోకి రాలేదని పేర్కొన్నారు. భారతదేశంలో ఐపీఎల్ యువ ఆటగాళ్లకు అందిస్తున్న అవకాశాలను పీఎస్‌ఎల్ కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు.

వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా చూపిన అక్రమ్
చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఐపీఎల్ సూపర్‌ స్టార్, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని అక్రమ్ ఉదాహరణగా ప్రస్తావించారు. అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ నిర్భయంగా దూకుడుగా బ్యాటింగ్ చేయగల యువ ఆటగాళ్లను పాకిస్థాన్ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఓ సందర్భంలో వైభవ్ వయసును అక్రమ్ 14 ఏళ్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వైభవ్ వయసు 15 ఏళ్లు. ఈ వయసు విషయంలో పొరపాటు జరిగినప్పటికీ, అక్రమ్ చెప్పాలనుకున్న యువ ప్రతిభకు వైభవ్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.

కేవలం పీఎస్‌ఎల్‌పైనే ఆధారపడొద్దు
పాకిస్థాన్‌లో ప్రతిభను వెలికితీయడానికి కేవలం పీఎస్‌ఎల్‌పై ఆధారపడటం సరిపోదని అక్రమ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌లో పాకిస్థాన్ బలపడాలంటే దేశీయ క్రికెట్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. క్లబ్ క్రికెట్‌ను బలోపేతం చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కరాచీ, లాహోర్ నగరాల్లో క్లబ్ క్రికెట్ అభివృద్ధి కోసం పీఎస్‌ఎల్ చెరో 100 మిలియన్ పాకిస్థానీ రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని వసీం అక్రమ్ సూచించారు. క్లబ్ స్థాయి నుంచే ఆటగాళ్లను గుర్తించి, వారికి సరైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తేనే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి బ్యాట్స్‌మెన్‌ తయారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.