Reading Time: < 1 minute
Saharanpur Mosque Row Prabodhanand Giri Says Go To Pakistan Or Bangladesh

Saharanpur Mosque Row: ఉత్తర్ ప్రదేశ్ సహారన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదును అధికారులు కూల్చేశారు. అయితే, దీనిని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై మహామండలేశ్వర్ స్వామి ప్రబోధానంద గిరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉన్నవాళ్లు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు.

సహారన్‌పూర్ వచ్చిన ప్రబోధానంద గిరి ఎస్ఎస్పీ ఆఫీసుకు వెళ్లి పోలీస్ అధికారుల్ని కలిశారు. కలెక్టరేట్ పరిపాలనకు సంబంధించిన ప్రాంతమని, అక్కడ మతపరమైన కార్యకలాపాలకు స్థానం లేదని అన్నారు. మసీదుపై చర్యలు తీసుకున్న పోలీస్, ఇతర అధికారుల్ని ప్రశంసించారు. మసీదును కోర్టు ఆదేశాల మేరకే తొలగించారని ఆయన పేర్కొన్నారు. మసీదు వక్ఫ్ బోర్డుకు చెందినదని వస్తు్న్న వాదనల గురించి మాట్లాడుతూ.. సంబంధిత పత్రాలు ఉంటే కోర్టులో సమర్పించాలని సవాల్ చేశారు.

అయితే ఈ అంశంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. జూలై 16న సహారన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ మసీదును తొలగించాలని ఆదేశించడంతో పాటు రూ.6.41 కోట్ల జరిమానా విధించారు. ఆ ఉత్తర్వును జిల్లా కోర్టు సెప్టెంబర్ 2న సమర్థించింది. అనంతరం సెప్టెంబర్ 5న అధికారులు మసీదును కూల్చివేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పాక్, బంగ్లాదేశ్ వెళ్లండి.. మసీదు కింద భావి..

మసీదు తొలగింపును వ్యతిరేకిస్తున్న వారిపై ప్రబోధానంద గిరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉంటే వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ల వచ్చని ప్రయాణ ఖర్చులు లేని వారికి తానే ఖర్చల్ని భరిస్తానని చెప్పారు.

మసీదు కూల్చివేత తర్వాత దాని కింద ఒక పురాతన బావి వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మసీదు శిథిలాల కింద సుమారు 20 అడుగుల లోతైన పాత బావి బయటపడింది. ఈ బావికి చారిత్రక, మతపరమైన ప్రాధాన్యం ఉందా అనే అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది నిర్ణయానికి రావొద్దని సూచించారు.