Reading Time: 2 minutes
Chandrababu Andhra Pradesh Investment Target Collectors Conference

అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడుల గ్రౌండింగ్ , జీఎస్డీపీ (GSDP) లక్ష్యాలపై కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆమోదం పొందిన పరిశ్రమలు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, పరిశ్రమల గ్రౌండింగ్‌తో పాటు అవి ప్రారంభమయ్యే తేదీలను కూడా ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యంత్రాంగం, మంత్రులు , ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి పెట్టుబడులను ప్రత్యక్ష ఫలితాలుగా మార్చాలని పిలుపునిచ్చారు.

నవంబరులో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ సమిట్… అక్టోబరులో రీజినల్ సదస్సులు

వచ్చే నవంబరు 2026లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘భాగస్వామ్య సదస్సు’ (Partnership Summit) నిర్వహించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ లోపే ఆమోదం పొందిన పరిశ్రమల గ్రౌండింగ్‌పై స్పష్టమైన పురోగతి రావాలని స్పష్టం చేశారు. అందుకోసం అక్టోబరు నెలలో విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి వంటి కీలక నగరాల్లో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన 20 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశాల్లో రూ.13.85 లక్షల కోట్ల విలువైన 359 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, వాటి ద్వారా 10.6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఇప్పటికే రూ.4.03 లక్షల కోట్ల విలువైన 160 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఎంఎస్ఎంఈ రంగానికి ఊతం… పర్యాటకానికి హెలిపాడ్లు

రాష్ట్రంలో ప్రస్తుతం తయారీ, సేవలు, వాణిజ్య రంగాల్లో 23.85 లక్షల ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులలో ఇప్పటికే 138 పార్కులకు ఆమోదం లభించిందని, వీటిలో 22 పార్కులు ప్రారంభం కాగా మిగిలిన 116 నిర్మాణం లో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు పర్యాటకరంగాన్ని పరుగులు తీర్పించేందుకు జిల్లాల్లో ఉన్న హెలిపాడ్లను గుర్తించి నోటిఫై చేయాలని సూచించారు. అత్యవసరాలు , పర్యాటక రవాణాకు అనువుగా, జిల్లా కేంద్రాల్లో నైట్ ల్యాండింగ్ సదుపాయం ఉన్న హెలిపాడ్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించారు.

ఆర్థిక వృద్ధిలో ఏపీ హవా.. క్వార్టర్-1లో అద్భుత ఫలితాలు

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని విశ్లేషిస్తూ జీఎస్డీపీ అంచనాలు , రికార్డు వృద్ధి రేట్లను సీఎం వివరించారు. ప్రస్తుత ధరల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వృద్ధిరేటు అంచనా 13.44 శాతంగా నమోదైంది. మొదటి త్రైమాసికంలో వ్యవసాయ అనుబంధ రంగాలు 14.19 శాతం, పారిశ్రామిక రంగం 14.81 శాతం , సేవల రంగం 12.70 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. ప్రత్యేకంగా ఆక్వా రంగం 31.77 శాతం మెరుపు వృద్ధిని సాధించగా, పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా రూ.1.13 లక్షల కోట్లు, సేవల రంగం ద్వారా రూ.1.60 లక్షల కోట్ల జీవీఏ (GVA) నమోదైనట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం, జిఎస్‌టి వసూళ్లలోనూ (18% పెరుగుదల) సాధించిన ఈ పురోగతిని కొనసాగిస్తూ, ప్రతీ జిల్లా తన వనరులను స్వయంగా మార్కెటింగ్ చేసుకుని కొత్త సంపదను సృష్టించాలని పిలుపునిచ్చారు.