Reading Time: 2 minutes
వద్దు మొర్రో అని వేడుకున్నా వదల్లేదు.. 22ఏళ్ల సైకో ఉన్మాదానికి 38 ఏళ్ల మహిళ బలి!

కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో దారుణం జరిగింది. ఓ భారతీయ సంతతి మహిళను ఓ యువకుడు నడిరోడ్డుపై దారుణంగా కాల్చి చంపాడు. షాలిని ఠాకూర్ వయసు 38 ఏళ్లు. ఆమె కాలిఫోర్నియాలోని ఓ షాపింగ్ ప్లాజాలో పని చేసేవారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రోహిత్ అనే 22 ఏళ్ల యువకుడు ఆమెను విపరీతంగా వేధిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అతడు తరచుగా ఒత్తిడి తెచ్చేవాడు. వయసులో చాలా చిన్నవాడు కావడంతో షాలిని అతడి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది.

అయినా ఆ ఉన్మాది ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు కారు కింద సీక్రెట్‌గా యాపిల్ ఎయిర్‌ట్యాగ్ అమర్చాడు. అంతేకాకుండా ఆమె ఇంటి తాళం చెవిని డూప్లికేట్ చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దొంగతనంగా చొరబడ్డాడు. ఈ విపరీత చేష్టలతో భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో మే నెలలో అతడిపై కోర్టు రిస్ట్రైనింగ్ ఆర్డర్ జారీ చేసింది.

అయినప్పటికీ ఉన్మాది రోహిత్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో షాలిని తన పని ప్రదేశానికి చేరుకుంది. అప్పటికే పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వద్ద కాపు కాసిన రోహిత్ ఒక్కసారిగా ఆమెను అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. భయాందోళన చెంది ఆమె అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

కానీ ఆ కిరాతకుడు ఆమెను వెంబడించి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. తూటాల దాటికి ఆమె రక్తపు మడుగులో కింద పడిపోయింది. ఆ తర్వాత కూడా కనికరం లేకుండా అతి సమీపం నుంచి ఆమె తలపై మరోసారి తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాలపాలైన షాలిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

హత్య అనంతరం రోహిత్ తన కారులో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కారు వివరాల ఆధారంగా పోలీసులు ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రీడర్ సిస్టమ్ ద్వారా అతడి వాహనాన్ని ట్రాక్ చేశారు. హైవే 50పై అతడిని పట్టుకునేందుకు సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. పోలీసులను చూసిన రోహిత్ కారులోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయిన రోహిత్ 2023లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తాజాగా గుర్తించారు. ఏళ్ల తరబడి వేధిస్తున్నా పోలీసులు తన బిడ్డకు సరైన రక్షణ కల్పించలేకపోయారని షాలిని తల్లి సుదేశ్ కుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. చనిపోవడానికి కేవలం గంట ముందు తన కూతురుతో ఫోన్లో మాట్లాడానని, పదిహేను నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి శాశ్వతంగా దూరమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..