
సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. మిగతా ఇండస్ట్రీల మాట ఏమో కానీ.. మన టాలీవుడ్ లో మాత్రం సినిమాల్లో అవకాశాల కోసం గుడ్డిగా నమ్మి మోసపోయేవారు ఎక్కువగానే ఉన్నారు. మోసగాళ్లను నమ్మి.. అటు అవకాశాలు లేక, ఇటు ఉన్నదంతా అమ్ముకొని రోడ్డున పడ్డవారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ లో సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడంటూ శనివారం ( సెప్టెంబర్ 12 ) ఓ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు బాధితులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి…
షార్ట్ ఫిలిమ్స్ , సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్థానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్ పేట్ శివం రోడ్డులోని డిస్ట్రిబ్యూటర్ శివ కుమార్ గౌడ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. గత మూడేళ్లుగా శ్రీరామ్, శివ కుమార్ , లావణ్య అనే వ్యక్తులు సినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు.
భారీగా మోహరించిన పోలీసులు:
తమ నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న అనంతరం తమకు అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శివను బయటకు పిలిచి మాట్లాడించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారని.. న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు.
సుమారు 25 మంది మహిళలను సినిమాల్లో అవకాశాల పేరుతో నమ్మించి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు బాధితులు.