పాల ఉండ్రాళ్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ పంచదార , ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి , 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ , ఒక కప్పు బియ్యపు పిండి, రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు , రెండు టేబుల్ స్పూన్స్ ఎండుకొబ్బరి ముక్కలు, ఒక కప్పు పాలు, మూడు టేబుల్ స్పూన్స్ బియ్యపు రవ్వ , ఒక కప్పు బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులోకి ఒక కప్పు నీటిని పోయాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, రెండు టీ స్పూన్ల పంచదారను కూడా వేయాలి. ఇలా పంచదార వేయడం వలన ఉండ్రాళ్లు తియ్యగా, టేస్టీగా వస్తాయి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దానిని వేడవ్వనివ్వాలి. నీరు వేడి అయినా తరవాత ఒక కప్పు బియ్యపు పిండిని వేసి దీనిలో కలపాలి. పిండి బాగా కలిశాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత, బాగా కలిపి చిన్న ఉండ్రాళ్లను తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా వేడి చేయాలి. ఇందులోకి రెండు టీ స్పూన్ల కిస్మిస్ లను, రెండు టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే రెండు టీ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి
డ్రై ఫ్రూట్స్ వేయించిన అదే గిన్నెలోకి నీటిని తీసుకొని వేడి చేయాలి. నీరు బాగా మరుగుతుండగా, తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్లను వేసుకోవాలి. మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక కప్పు పాలను పోసుకోవాలి. మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పాయసం చిక్కగా అవ్వడానికి మూడు టీ స్పూన్ల బియ్యపు రవ్వను వేయాలి. మీరు బియ్యపు రవ్వ కోసం బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టి మిక్సీలో వేసి రవ్వలా చేసి వేయొచ్చు. లేదా డైరెక్ట్ గా రెడీమేడ్ గా దొరికే బియ్యపు రవ్వను కూడా ఉపయోగించవచ్చు. బియ్యపు రవ్వ వేసాక మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొత్తగా చేసే వారు పాయసం విరిగిపోకుండా ఉండాలంటే, స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిగా అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో సహా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా, నోరూరించే ఉండ్రాళ్ళ పాయసం తయారైపోయింది. దీనిని వినాయక చవితికి ప్రత్యేక ప్రసాదంగా గణపతికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే, మీకు ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు.




