Reading Time: < 1 minute
Lemon Storage Tips How To Keep Lemons Fresh For A Month Without Losing Juice

Lemon Storage Tips: మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చి కూరగాయల బుట్టలో వేసేస్తే అవి త్వరగా ఎండిపోవడం మొదలవుతాయి. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా కొన్ని రోజులు మాత్రమే తాజాగా కనిపిస్తాయి. ఆ తర్వాత నిమ్మకాయల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం చాలా అవసరం.

సరిగ్గా స్టోర్ చేస్తే నిమ్మకాయలు చాలా రోజులు తాజాగా ఉంటాయి, అలాగే రసం కూడా తగ్గదు. ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ నిమ్మకాయలు కొని తెచ్చినప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ చాలా ఉపయోగపడతాయి. వీటితో నిమ్మకాయలు త్వరగా చెడవు, ఎండిపోవు కూడా.. నిమ్మకాయలను చాలా రోజులు నిల్వ చేయాలనుకుంటే వాటితో ఊరగాయ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఊరగాయలో మసాలాలు వేస్తాం కాబట్టి రుచి మారిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది నిమ్మకాయలను తాజాగా ఎలా ఉంచాలి.? వాటి రుచి, రసం రెండూ ఎలా అలాగే ఉండాలి అనే విషయం. అందుకే ఆ పద్ధతులను తెలుసుకుందాం.

మొదటి పద్ధతి – నీటిలో ముంచి ఉంచడం:

నిమ్మకాయలు తాజాగా ఉంచడానికి చాలా ఇళ్లలో ఈ పద్ధతినే పాటిస్తారు. నిమ్మకాయలను నీటిలో ముంచి ఉంచితే అవి తాజాగా ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. వాటిని శుభ్రమైన ఎయిర్‌టైట్ జార్‌లో వేసి, నీళ్లు నింపి మూత బిగించి పెట్టాలి. ఇలా చేస్తే నిమ్మకాయలు చాలా రోజులు చెడకుండా ఉంటాయి.

రెండో పద్ధతి – ఆవ నూనె రాయడం:

నిమ్మకాయలపై ఆవ నూనెను పలుచగా రాసి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి నిల్వ చేయండి. అవసరమైనప్పుడు కంటైనర్ నుంచి తీసి కడిగి వాడుకోవచ్చు. మిగిలిన నిమ్మకాయలను అలాగే జార్‌లోనే ఉంచేయండి. నూనె పైన సన్నని పొరలా ఉండడం వల్ల నిమ్మకాయలు త్వరగా ఎండిపోవు, బయటి గాలి కూడా లోపలికి చొరబడదు.

మూడో పద్ధతి – టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచడం:

ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలి తాను క్రమం తప్పకుండా పాటించే పద్ధతి ఇదేనని చెప్పారు. ప్రతి నిమ్మకాయను వేరు వేరుగా టిష్యూ పేపర్‌లో బాగా చుట్టి, ఎయిర్‌టైట్ జార్‌లో పెట్టి మూత బిగించి ఉంచాలి. టిష్యూ పేపర్ లేకపోతే మరేదైనా పేపర్ కూడా వాడవచ్చు. ఈ పద్ధతితో నిమ్మకాయలు నెల రోజుల కంటే ఎక్కువ కాలం కూడా చెడకుండా ఉంటాయి.