Reading Time: 2 minutes

పుట్టుక విచిత్రం, పునర్జన్మ మరీ విచిత్రం! సురపతి కావడం, చిట్టి ఎలుకను వాహనంగా చేసుకోవడం, మహాభారతం రాయడానికి ఘంటం చేతపట్టడం.. ఇలా ఏకదంతుడి కథలన్నీ ప్రతి ఇంటా మురిసిపోయే పర్వదినమే వినాయక చవితి. తొలిపూజలు అందుకునే ఆ గణనాథుడి నామం పలకగానే భక్తులలో ఏదో తెలియని చైతన్యం, అంతులేని ఆనందం ఆవహిస్తాయి. భాద్రపద శుద్ధ చవితి వేళ మట్టి గణపతినే ఎందుకు పూజించాలి? ఆ ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సృష్టి రహస్యానికి ప్రతీకగా మట్టి పూజ: ముద్గలపురాణంలో కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్వాన్ని వివరిస్తూ మట్టి విగ్రహ ప్రాముఖ్యతను వెల్లడించారు. జడపదార్థమైన భూమి , ప్రాణాధార శక్తి అయిన నీరు కలిసినప్పుడే సృష్టి సాగుతుంది. అలాగే పార్వతీదేవి నలుగు పిండితో నమూనా చేసి వినాయకుడికి ప్రాణం పోసింది. అందుకే మట్టి, నీరు కలిపి తయారుచేసిన మృణ్మయ మూర్తిని పూజించడమే నిజమైన శాస్త్ర సమ్మతం.

Clay Ganesha Puja: Know the Puranic Significance Behind This Sacred Tradition
Clay Ganesha Puja: Know the Puranic Significance Behind This Sacred Tradition

యోగశాస్త్రం – మూలాధార చక్రం: మన శరీరంలోని షట్చక్రాలలో మొదటిది వెన్నుపూస ప్రారంభంలో ఉండే మూలాధార చక్రం. యోగశాస్త్రం ప్రకారం ఈ చక్రానికి అధిష్ఠాన దేవుడు గణపతి. ఇక మూలాధారం అనేది పృథ్వీ తత్వానికి సంకేతం. కాబట్టి భూమికి సంకేతమైన మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తే ఆ పరమాత్మ అనుగ్రహం, ఆధ్యాత్మిక పురోగతి సత్వరమే లభిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

పంచభూతాల ఆరాధన – నిమజ్జన తత్వం: మట్టి గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఈ మూర్తిని పూజించడం ద్వారా సృష్టికి మూలమైన పంచభూతాలను ఆరాధించినట్లవుతుంది. ఇక ఏ తత్వాలతో రూపుదిద్దుకుందో, చివరకు అందులోనే లయమవడం సృష్టి ధర్మం. అందుకే పూజ తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు, ఆ పంచతత్వాలు తిరిగి ప్రకృతిలోనే లీనమవుతాయి.

ఇక పరమాత్మ ఒక్కడే అనే సత్యానికి, ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి మట్టి గణపతి పూజే అత్యుత్తమ నిదర్శనం. ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు పొందుదాం.

గమనిక: ఇంట్లో లేదా పూజా వేదికల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్ రంగులతో చేసిన విగ్రహాలకు బదులుగా సహజ సిద్ధమైన మట్టి విగ్రహాలను వాడటం శాస్త్రరీత్యా శ్రేయస్కరం మరియు పర్యావరణానికి ఎంతో మేలు.

The post గణపతి పూజలో మట్టి విగ్రహం ప్రాముఖ్యత.. ఆధ్యాత్మిక అర్థం ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.