Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Sledges Tilak Varma In Duleep Trophy 2026 Final

Vaibhav Sooryavanshi Sledges Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నాలుగో రోజు తెలుగు ప్లేయర్ తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి రోజు తిలక్ తనను స్లెడ్జ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. బదులు తీర్చుకున్నాడు. తిలక్ వ్యవహరించిన దానికి అదే రీతిలో వైభవ్ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తిలక్ వర్మ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తిలక్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు బుడ్డోడు కూడా అలానే రియాక్ట్ అయ్యాడు. తిలక్ వర్మను భుజంతో గుద్దాడు. దీంతో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై అంపైర్ వైభవ్‌తో కాసేపు మాట్లాడాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా.. తొలి ఇన్నింగ్స్‌లో తనకు కూడా ఇలాగే జరిగిందంటూ అంపైర్‌కు సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘సర్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాకు కూడా ఇలాగే జరిగింది’ అంటూ వైభవ్ చెప్పిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. తిలక్ వర్మకు తనదైన శైలిలో వైభవ్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సరదా స్లెడ్జింగ్‌లో వైభవ్ సూర్యవంశీదే పైచేయిగా నిలిచింది. ఈ వీడియో చూసిన వాళ్లు బుడ్డోడిపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు’, ‘వైభవ్.. తగ్గేదేలే’, ‘ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించి దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సౌత్ జోన్‌ను ఓడించి.. మూడోసారి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో ఈస్ట్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో చెలరేగడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం సౌత్ జోన్‌ను 325 పరుగులకే ఆలౌట్ చేసింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్ తరఫున తిలక్ వర్మ 99 పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.