
మన ఇంట్లో ఉండే ప్రతి ప్యాకెట్ ఫుడ్‌ను ఒకసారి గమనించండి. పిల్లల బిస్కెట్ల నుంచి మన సాయంత్రం నూడుల్స్ వరకు… ఫ్రిజ్‌లోని కూల్‌డ్రింక్ నుంచి టీవీ చూస్తూ తినే చిప్స్ వరకు… ఇవన్నీ మన జీవితంలో అంత సహజంగా కలిసిపోయాయి, వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరముందని కూడా మనకు అనిపించదు.
కానీ ఆ ప్యాకెట్‌లో మనకు తెలియని స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు దాగి ఉంటే? అవి ప్రతిరోజూ కొద్దికొద్దిగా శరీరంలోకి వెళ్లి, సంవత్సరాల తర్వాత దాని ప్రభావాన్ని మనపై చూపిస్తాయి. అందుకే ఇప్పుడు ఇండియాలో ప్యాకేజ్డ్ ఫుడ్ గురించి మొదలైన చర్చ మనం ఏం తింటున్నామనే దానికంటే… మనకు తెలియకుండా ఏం తింటున్నామనే ప్రశ్నగా మారింది.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త హెచ్చరిక లేబుల్స్ తీసుకురావాలని చూస్తోంది. ఒక ప్యాకెట్‌లో ప్రభుత్వ పరిమితికి మించి అదనపు చక్కెర, ఉప్పు లేదా సంతృప్త కొవ్వు ఉంటే… ఆ విషయం ప్యాకెట్ వెనుక చిన్న అక్షరాల్లో దాక్కోకుండా, ముందుభాగంలోనే ఎరుపు రంగు హెచ్చరికగా కనిపించాలన్నది ప్రతిపాదన. సుప్రీంకోర్టు ప్రశ్నల తర్వాత ఈ విషయంలో కఠినమైన విధానం తీసుకురావాలనే ఆలోచన మరింత బలపడింది. దీనికి ఆహార పరిశ్రమ నుంచి వ్యతిరేకత ఉన్నా, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం స్పష్టమైన లేబులింగ్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు.
ఇంత ఆందోళన ఎందుకు వస్తోందంటే… ఇండియాలో డయాబెటిస్ పరిస్థితి ఇప్పటికే భయపెడుతోంది. 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారు. ప్రపంచంలో నమోదవుతున్న డయాబెటిస్ కేసుల్లో దాదాపు నాలుగో వంతు ఇండియాలోనే ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెర ఉన్న పదార్థాలు ఈ సమస్యకు కారణమయ్యే అంశాల్లో ఒకటిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఈ ఆరోగ్య భారం పెరుగుతుంటే, మరోవైపు ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ మాత్రం మరింత వేగంగా పెరుగుతోంది.
2025లో దాదాపు 11 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ 2026లో 11.7 లక్షల కోట్లకు చేరిందని అంచనా. 2034 నాటికి 20 లక్షల కోట్లకు పైగా పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇండియాలో చౌకగా దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇంత పెద్ద మార్కెట్‌గా మారడానికి ఒక ప్రధాన కారణం మన జేబు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇక్కడ కుటుంబ ఆదాయం తక్కువ. అందుకే తక్కువ ధరలో కడుపు నింపే ఆహారానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ అవసరాన్ని పెద్ద కంపెనీలు చాలా ముందుగానే గుర్తించాయి.
దాదాపు వందేళ్లుగా విదేశీ ఆహార సంస్థలు ఇండియాలో స్థానికంగా ఉత్పత్తులు తయారు చేస్తూ ధరలను అందుబాటులో ఉంచాయి. ఒకప్పుడు ఖరీదైన నెయ్యికి చౌకైన అల్టెర్‌నెట్‌గా డాల్డా వాడుకలోకి వచ్చింది. తర్వాత ఇదే ధర, సౌకర్యం, రుచిపై ఆధారపడిన మార్కెట్ నెమ్మదిగా ప్యాకెట్ ఆహారాల ప్రపంచంగా మారింది. మ్యాగీ అందుకు ఒక పెద్ద ఉదాహరణ. 1983లో ఇండియాలోకి వచ్చిన మ్యాగీ, సమయం తక్కువగా ఉన్న తల్లులు, వెంటనే ఆకలి తీర్చుకోవాలనుకునే పిల్లలను లక్ష్యంగా చేసుకుని రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే ఆహారంగా ప్రచారం చేసుకుంది.
ఆ చిన్న సౌకర్యం నెమ్మదిగా అలవాటైంది. ఇప్పుడు ఇండియాలో ఏడాదికి దాదాపు 600 కోట్ల సార్లు మ్యాగీ తింటున్నారని అంచనా. కానీ అదే బ్రాండ్ వేరే దేశాల్లో వేరే పదార్థాలతో తయారవుతోంది. ఇండియాలో మ్యాగీ వేరియంట్లలో పామాయిల్ ఉపయోగిస్తుండగా, బ్రిటన్‌లో అమ్మే అనేక రకాల మ్యాగీలో సన్‌ఫ్లవర్ నూనె వాడుతున్నారు. ఇండియాలో దొరికే కిట్‌క్యాట్‌లో కోకో పరిమాణం కూడా ఆస్ట్రేలియా వెర్షన్ కంటే తక్కువగా ఉంది. కంపెనీల వివరణ ప్రకారం స్థానిక రుచి, అందుబాటులో ఉన్న పదార్థాలు, వాతావరణం, వినియోగదారుల అభిరుచులను బట్టి ఉత్పత్తుల తయారీ మారుతుంది. మంచి పదార్థాలు ఖరీదైనవి కావడంతో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
తక్కువ ధరకు ఉత్పత్తులను అందించాలంటే ఖర్చులను అదుపులో ఉంచాల్సి ఉంటుందని పరిశ్రమలో పనిచేసినవారు చెబుతున్నారు. ఈ లెక్కలో వినియోగదారుడి పరిస్థితి మాత్రం విచిత్రంగా మారింది. అతనికి తక్కువ ధర కావాలి. అదే సమయంలో తన కుటుంబానికి మంచి ఆహారం కావాలి. ఆ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని ఎవరు భర్తీ చేయాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రుచి విషయంలో కూడా కంపెనీలకు పెద్ద సవాలే ఉంది.
థమ్స్ అప్‌ను 1993లో కోకాకోలా కొనుగోలు చేసినప్పుడు, దాన్ని క్రమంగా తొలగించి తన సొంత పానీయానికి చోటివ్వాలని అనుకుంది. కానీ ఇండియన్లు ఆ రుచికి బలంగా అలవాటుపడటంతో ఆ బ్రాండ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. ఈరోజు థమ్స్ అప్ 8 వేల కోట్లకు పైగా విలువైన భారీ బ్రాండ్‌గా ఎదిగింది. ఒకసారి ఒక రుచి మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి, మన అలవాటుగా మారితే… దాన్ని మార్చడం ఎంత కష్టమో ఈ కథ చెబుతోంది.
ఇలాంటి ఆహారాలపై స్పష్టమైన హెచ్చరికలు పెట్టాలన్న చర్చ ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో కూడా జరిగింది. చిలీలో 2016లో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాలపై నల్ల రంగు గుర్తులు పెట్టే విధానం తీసుకొచ్చారు. ఆ తర్వాత చక్కెర కలిగిన పానీయాల కొనుగోళ్లు 23.7 శాతం తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇండియాలో మాత్రం ప్రతిపాదిత నిబంధనలతో ప్యాకేజ్డ్ ఫుడ్‌లో దాదాపు 80 శాతం ఉత్పత్తులు అధిక కొవ్వు, చక్కెర లేదా ఉప్పు ఉన్నవిగా గుర్తించబడే అవకాశం ఉందని ఆహార పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే పరిశ్రమ ఈ నిబంధనలను ఎందుకు ఆందోళనగా చూస్తోందో కూడా అక్కడే అర్థమవుతుంది. చివరికి ఈ కథ మ్యాగీ గురించో, థమ్స్ అప్ గురించో కాదండి.. మన జీవితం వేగంగా మారుతున్న కొద్దీ, ఆ వేగానికి సరిపోయే ఆహారం కూడా మన చేతిలోకి వచ్చింది. కానీ ఆ సౌకర్యంతో పాటు మన శరీరంలోకి ఏం వెళ్తుందో తెలుసుకునే అలవాటు మాత్రం అదే వేగంతో పెరగలేదు.
ఈరోజు మనం ఒక ప్యాకెట్ తెరిచి తింటాం. రేపు ఇంకో ప్యాకెట్ తెరిచి తింటాం. ఏమీ అనిపించదు. శరీరం కూడా వెంటనే హెచ్చరించదు. కానీ సంవత్సరాల తర్వాత వచ్చే ఒక వైద్య పరీక్ష… మనం ఇంతకాలం పట్టించుకోని ఆ చిన్న ప్యాకెట్లన్నింటినీ ఒక్కసారిగా గుర్తు చేయొచ్చు. అందుకే ఇప్పుడు ప్యాకెట్ ముందు భాగంలో ఒక ఎరుపు గుర్తు పెట్టాలన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో..!