Reading Time: 2 minutes
Meta Muse Ai Agent Launched Features Security Whatsapp Support Are There

Meta Muse: మెటా (Meta) కొత్త పర్సనల్‌ AI ఏజెంట్‌ మ్యూజ్‌ (Muse) ను లాంచ్ చేసింది. సాధారణ AI చాట్‌బాట్‌ల మాదిరిగా కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. యూజర్ల తరఫున పనులను పూర్తి చేయడం, టాస్క్‌లను నిర్వహించడం, ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం, దీర్ఘకాలిక లక్ష్యాలను యాక్షన్‌ ప్లాన్‌లుగా మార్చడం దీని ప్రత్యేకత.

వర్చువల్‌ కంప్యూటర్‌పై పనిచేసే మ్యూజ్‌:

ప్రత్యేకంగా వ్యక్తిగత AI ఏజెంట్‌గా రూపొందించిన మ్యూజ్‌ ను సురక్షితంగా, ప్రైవేట్‌గా, అందరికీ సులభంగా ఉపయోగించుకునేలా మెటా అభివృద్ధి చేసింది. ఇది మ్యూజ్‌ సెక్యూర్ VM అనే ప్రత్యేక వర్చువల్‌ కంప్యూటర్‌పై పనిచేస్తుంది. ఇందులో ఏజెంట్‌తో పాటు యూజర్‌కు సంబంధించిన డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. ప్రత్యేక బ్రౌజర్‌ ద్వారా యూజర్‌ రోజువారీగా ఉపయోగించే వివిధ యాప్స్‌, వెబ్‌సైట్లలో వారి తరఫున పనులు చేయగలదు.

వాట్సాప్ లోనూ..

మ్యూజ్‌ తో మాట్లాడటం కూడా సాధారణ వ్యక్తితో మెసేజ్‌ చేస్తున్నట్లే ఉంటుంది. మ్యూజ్‌ యాప్‌లో లేదా నేరుగా వాట్సాప్లో యూజర్లు తమకు కావాల్సిన పనిని చెప్పవచ్చు. ఆ తర్వాత మ్యూజ్‌ స్పార్క్ అనే మెటా రూపొందించిన అధునాతన AI మోడల్‌ సహాయంతో సంబంధిత పనులను పూర్తి చేసేందుకు ఇది చర్యలు తీసుకుంటుంది. దీనికి ప్రత్యేకమైన టెక్నికల్‌ పరిజ్ఞానం అవసరం లేదు. ఈమెయిల్‌ పంపడం, ట్రావెల్‌ బుక్‌ చేయడం వంటి సాధారణ పనుల నుంచి పెద్ద లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించడం వరకు ఇది చేయగలదు. యూజర్‌ ఒక లక్ష్యాన్ని చెబితే.. దానికి అనుగుణంగా వ్యక్తిగత ప్లాన్‌ను రూపొందించి.. సమయం, వనరులను సమన్వయం చేస్తూ పనిని ముందుకు తీసుకెళ్తుంది. అవసరమైతే బ్రౌజర్‌ను తెరిచి ఫారమ్‌లను నింపడం, యూజర్‌ తరఫున కొన్ని అంశాలపై చర్చలు జరపడం కూడా చేయగలదు.

ఆఫ్‌లైన్‌లో ఉన్నా..

ఎక్కువ సమయం పట్టే పనుల విషయంలో యూజర్‌ యాప్‌ను మూసివేసిన తర్వాత కూడా మ్యూజ్‌ పని కొనసాగిస్తుంది. పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడు లేదా ఈమెయిల్‌ పంపడం, కొనుగోలు చేయడం వంటి కీలక చర్యకు యూజర్‌ అనుమతి అవసరమైనప్పుడు తిరిగి సమాచారం అందిస్తుంది. ఉదాహరణకు కారు విక్రయానికి మెరుగైన ధర పొందడం, బిల్లును తగ్గించే ప్రయత్నం చేయడం లేదా వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా ట్రైనింగ్‌ ప్లాన్‌ను మార్చడం వంటి పనులను కూడా నిర్వహించగలదు.

ప్రతి యూజర్‌కు ప్రత్యేక భద్రతా:

మ్యూజ్‌ భద్రత, గోప్యతకు కూడా మెటా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి యూజర్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించిన క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఇది పనిచేస్తుంది. ఇతర వ్యక్తుల AI ఏజెంట్లు దానిని యాక్సెస్‌ చేయలేరు. యూజర్‌కు సంబంధించిన డేటా, కనెక్ట్‌ చేసిన సేవల క్రెడెన్షియల్స్‌ కూడా అదే సురక్షిత వాతావరణంలో ఉంటాయి. ఇది పనిచేసే కంప్యూటర్‌లో Sentinel అనే ప్రత్యేక ఏజెంట్‌ కూడా ఉంటుంది. Muse ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేయాలంటే Sentinel అనుమతి అవసరం. సున్నితమైన చర్యలు చేపట్టే ముందు యూజర్‌ అనుమతి తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించారు. Museకు యూజర్ల పాస్‌వర్డ్‌లు లేదా చెల్లింపు వివరాలు నేరుగా కనిపించవు. యూజర్లు అందించే క్రెడెన్షియల్స్‌ సురక్షిత స్టోరేజ్‌లో ఉంటాయి.

పూర్తి నియంత్రణ యూజర్ల చేతుల్లోనే..

మ్యూజ్‌ చేసే, చేయబోయే చర్యలకు సంబంధించిన పూర్తి ఆడిట్‌ ట్రెయిల్‌ను యూజర్లు చూడవచ్చు. ఏ యాప్స్‌కు మ్యూజ్‌ ను కనెక్ట్‌ చేయాలో, వాటికి ఎంత యాక్సెస్‌ ఇవ్వాలో కూడా యూజర్లే నిర్ణయించుకోవచ్చు. అవసరమైనప్పుడు యాక్సెస్‌ను మార్చడం లేదా ఏదైనా సర్వీస్‌ను డిస్‌కనెక్ట్‌ చేయడం వీలుంటుంది. అలాగే తమ సంభాషణలను మెటా AI మోడళ్ల శిక్షణకు ఉపయోగించకూడదని యూజర్లు ఎంచుకోవచ్చు.

డేటాను యాక్సెస్‌ చేయలేని ఎన్‌క్రిప్షన్‌:

ఈ ఏడాది చివర్లో మ్యూజ్‌ కాన్ఫిడెంటిల్ VMను తీసుకురానున్నట్లు మెటా వెల్లడించింది. ఇందులో యూజర్‌ డేటా, మ్యూజ్‌ తో జరిగిన సంభాషణలు సహా మొత్తం వర్చువల్‌ మెషీన్‌ యూజర్‌ వద్ద మాత్రమే ఉండే కీతో ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. దీంతో మెటా కూడా ఆ డేటాను యాక్సెస్‌ చేయలేని విధంగా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు. ప్రస్తుతం మ్యూజ్‌ ను అమెరికాలో iOS, ఆండ్రాయిడ్, muse.ai ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. త్వరలో AI గ్లాసెస్‌లో కూడా అందుబాటులోకి రానుంది. సాధారణ అవసరాలకు ఎక్కువగా ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉండగా, మరిన్ని పనులు చేయాలనుకునే యూజర్ల కోసం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.