Reading Time: 2 minutes
Sri Lanka Beat Pakistan To Reach Womens Asia Cup 2026 Final

Asia Cup 2026: మహిళల ఆసియా కప్‌ 2026లో శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో ఫాతిమా సనా 36 బంతుల్లో 47 పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ ను అందుకుంది.

పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో శ్రీలంక బౌలర్లు కీలక పాత్ర పోషించారు. చమరి అథపత్థు, చముడి ప్రభోద 2 వికెట్లు పడగొట్టారు. అయితే పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా చివర్లో వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును 130కి చేర్చింది. ఇక 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హారి అద్భుతంగా పోరాడారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 59 బంతుల్లో 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సమరవిక్రమ 31 బంతుల్లో 36 పరుగులు చేయగా, దిల్హారి 33 బంతుల్లో 33 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక విజయానికి చేరువైంది. ఈ సమయంలో ఫాతిమా సనా మరోసారి తన బౌలింగ్‌తో శ్రీలంకకు షాక్ ఇచ్చింది. సమరవిక్రమ, దిల్హారిని వరుసగా పెవిలియన్‌కు పంపి పాకిస్థాన్‌కు ఆశలు కల్పించింది. కానీ శ్రీలంక బ్యాటింగ్‌లోని లోతు ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది.

నిలాక్షిక సిల్వ, కౌషిని నుత్యాంగనా చివర్లో బాధ్యతగా ఆడి శ్రీలంకకు విజయాన్ని అందించారు. కౌషిని సనా బౌలింగ్‌లో కీలక సమయంలో సిక్స్ కొట్టడంతో సమీకరణం మరింత సులభమైంది. చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. ఫాతిమా సనా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినప్పటికీ.. పాకిస్థాన్ ఓటమి తప్పలేదు. బ్యాటింగ్‌లో 47 పరుగులు చేసిన ఆమె బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టింది. జట్టు ఓడినా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది. ఈ విజయంతో శ్రీలంక వరుసగా రెండోసారి మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫైనల్‌లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది. ఫైనల్ సెప్టెంబర్ 13 (ఆదివారం) రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.