
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభమై దశాబ్ద కాలం ముగిసినా ఒక్కటంటే ఒక్క ప్రపంచ స్థాయి బ్యాటర్‌ను కూడా తయారు చేయలేకపోయిందని పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పుణ్యమా అని భారత్‌లో 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్లు వెలుగులోకి వస్తుంటే, పాకిస్థాన్‌లో మాత్రం సరైన బ్యాటింగ్ టాలెంట్ ఎందుకు రావడం లేదని పీసీబీ(PCB) ని నిలదీశారు.
వైభవ్ సూర్యవంశీపై వసీం అక్రమ్ ప్రశంసలు:
ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా చరిత్రకెక్కిన వైభవ్, తన బౌండరీల వర్షంతో ప్రపంచ క్రికెట్‌ను ఊపేస్తున్నాడు. పీఎస్ఎల్‌లో ఇలాంటి ఒక 14–, 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం బయటకు వచ్చినప్పుడే పాకిస్థాన్ క్రికెట్ బాగుపడుతుందని అక్రమ్ స్పష్టం చేశారు.
పీఎస్ఎల్ 10 ఏళ్లలో ఒక్కడ్ని తయారు చేయలేదు:
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (KKR) మెంటార్‌గా వ్యవహరించి రెండు టైటిళ్లు అందించిన అక్రమ్, పీఎస్ఎల్‌లోనూ పలు ఫ్రాంచైజీలకు బాధ్యతలు నిర్వర్తించారు. పీఎస్ఎల్ ప్రారంభమై 10 ఏళ్లయినా కొద్దిమంది బౌలర్లను మాత్రమే ఇచ్చిందని, చెప్పుకోదగ్గ ఒక్క బ్యాటర్‌ను కూడా ఎందుకు తయారుచేయలేకపోయిందని యూట్యూబర్ ఫుర్కాన్ భట్టి ఇంటర్వ్యూలో నిలదీశారు. పాక్ క్రికెట్ బాగుపడాలంటే కరాచీ, లాహోర్‌లలో క్లబ్ క్రికెట్‌కు తలో 100 మిలియన్ రూపాయలు ఖర్చు చేసి కింది స్థాయి నుంచి ఆటగాళ్లను తయారు చేయాలని పాక్ క్రికెట్ బోర్డుకి సూచించారు.
ALSO READ : ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో ఓపెనర్‌గా సంజు, వైభవ్‌కు షాక్?
క్లీన్ స్వీప్ దిశగా పాకిస్థాన్:
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బాబర్ ఆజమ్ సేన ఘోర పరాభవం దిశగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన పాక్, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ ఓటమి అంచున నిలిచి 0–3 తో వైట్‌వాష్‌కు చేరువవుతోంది. పాక్ జాతీయ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా విఫలమవుతున్న తరుణంలో వసీం అక్రమ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.