
రాయల్ ఫ్యాషన్ చరిత్రలోనే చెరగని ముద్ర వేసిన ప్రిన్సెస్ డయానా ఐకానిక్ ‘రివెంజ్ డ్రెస్’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ చారిత్రాత్మక బ్లాక్ గౌన్ వేలానికి రాబోతోంది. న్యూయార్క్‌లోని సోథెబైస్ (Sotheby’s) వేదికగా ఈ డ్రెస్‌ను వేలం వేయనున్నారు. దీని ధర కోట్లలో పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..
డిసెంబర్ 9, 2026న జరగనున్న ఫ్యాషన్ ఈవెంట్‌లో ఈ డ్రెస్‌ను వేలం వేయనున్నారు. దీని ధర సుమారు 1.5 లక్షల నుంచి 3 లక్షల అమెరికన్ డాలర్ల వరకు పలికే అవకాశం ఉందని అంచనా . అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.4 కోట్ల నుంచి రూ.2.87 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రెస్ వేలం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
గ్రీక్ డిజైనర్ క్రిస్టినా స్టాంబోలియన్ రూపొందించిన ఈ బ్లాక్ సిల్క్, ఆఫ్-ది-షోల్డర్ బాడీకాన్ గౌన్‌ను డయానా.. 1994 జూన్ 29న లండన్‌లోని సెర్పెంటైన్ గ్యాలరీలో జరిగిన వానిటీ ఫెయిర్ గాలా డిన్నర్‌కు ధరించారు. అయితే ఆ రాత్రి ఆమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కేవలం అందం కోసమే కాదు.. ఓ బలమైన సందేశంగా మారింది.
అదే రోజు అప్పటి భర్త, ప్రస్తుత కింగ్ చార్లెస్ III తన వివాహేతర సంబంధాన్ని టెలివిజన్ డాక్యుమెంటరీలో బహిరంగంగా అంగీకరించారు. కోట్లాది మంది వీక్షిస్తున్న సమయంలో, డయానా మాత్రం ధైర్యంగా ఈ బ్లాక్ డ్రెస్‌లో బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఈ గౌన్‌కు ‘రివెంజ్ డ్రెస్’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
పెర్ల్ చోకర్, ఎర్రటి నెయిల్ పాలిష్‌తో ఆమె పూర్తి చేసిన లుక్ అప్పట్లో సంచలనంగా మారింది. సంప్రదాయంగా దుఃఖం, శోకానికి ప్రతీకగా భావించే నలుపు రంగును డయానా ఆ రాత్రి ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్యానికి చిహ్నంగా మార్చారనే అభిప్రాయం ఏర్పడింది.
అయితే వేలానికి ముందు ఈ గౌనును సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు లండన్‌లో సోథెబీస్‌లో ప్రదర్శించనున్నారు. అనంతరం హాంకాంగ్, జెనీవాలోనూ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. డయానా చివరిసారిగా 1997లో తన 79 గౌన్లను వేలం వేసి స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమీకరించారు. 1997లో ఆమె విషాద మరణం తర్వాత కూడా డయానా ఫ్యాషన్ వారసత్వం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి అదే ‘రివెంజ్ డ్రెస్’ వేలం నేపథ్యంలో ఆమె పేరు ప్రపంచ ఫ్యాషన్ వేదికపై మరో సారి మార్మోగుతోంది.
Black, short, and off the shoulder, Princess Diana’s eveningwear caused jaws to drop back in 1994 when she arrived at London’s Serpentine Gallery.
Register to bid >> https://t.co/xKBgLKMxHl
As she stepped out of her car and into a sea of camera flashes, the Princess of Wales… pic.twitter.com/uhBsDJW80G
— Sotheby’s (@Sothebys) September 10, 2026