Reading Time: 2 minutes
Ameesha Patel House Theft 5 Lakh Gold Bangle Stolen Maid Arrested

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని చర్చ్‌గేట్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు.. 40 ఏళ్ల ఇంటి పని మనిషిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్‌కు చెందిన సీమా ఘాటే అమీషా పటేల్ తల్లిదండ్రుల ఇంట్లో దాదాపు ఏడాదిన్నరగా గృహ సహాయకురాలిగా పనిచేస్తోంది. ఇంట్లోని విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఆశా పటేల్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళపై కేసు నమోదు చేసి, ఆధారాలను పరిశీలించారు. అనంతరం దర్యాప్తు బృందం సీమా ఘాటేను నిందితురాలిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, చోరీకి గురైన వస్తువుల్లో సుమారు రూ.5 లక్షల విలువైన డైమండ్ స్టడెడ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయని, ఈ ఆభరణాలు ఆగస్టు 20న ఇంటి నుంచి మాయమైనట్లు తెలుస్తోంది. ఆశా పటేల్ సీమా ఘాటేపై అనుమానంతో నగలను తిరిగి ఇవ్వాలని అడిగిన తిరిగి ఇవ్వకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా మెరైన్ డ్రైవ్ పోలీసులు సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, సెప్టెంబర్ 15 వరకు పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చోరీకి గురైన ఆభరణాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు నగలు రికవరీ కాలేదని సమాచారం. సీమా ఘాటేకు గతంలో ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే, 2000లో ‘కహో నా… ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హమ్‌రాజ్’, ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘భూల్ భులయ్యా’, ‘రేస్ 2’ వంటి సినిమాల్లో నటించారు. 2023లో ‘గదర్ 2’తో మరోసారి పెద్ద తెరపై సందడి చేసిన ఆమె, ఆ సినిమాతో కెరీర్‌లో మరో భారీ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడు అమీషా సినిమాల కంటే ఆమె తల్లిదండ్రుల ఇంట్లో జరిగిన ఈ చోరీ ఘటన కారణంగానే వార్తల్లో నిలిచారు. రూ.5 లక్షల విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? చోరీ వెనుక అసలు ఏం జరిగింది? నిందితురాలి నుంచి నగలు ఎప్పుడు రికవరీ అవుతాయనేది పోలీసుల తదుపరి దర్యాప్తులో తేలాల్సి ఉంది.