Reading Time: < 1 minute

మగ పోలీసులు కావాలనే మమ్మల్ని లాగారు : బీఆర్‌‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు 

Caption of Image.

 

  • వాళ్లు వాళ్ల అమ్మ గురించి, అక్కల గురించి మాట్లాడుతున్నారు
  • మాకు జరిగిన అవమానంపై ఎందుకు మాట్లాడం లేదు 
  • అసెంబ్లీ లాబీలో మీడియాతో బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు సబిత, సునీత, కోవా లక్ష్మి చిట్‌‌చాట్ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా గేటు వద్ద మగ పోలీసులు కావాలనే తమను లాగారని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. తమపై ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారన్నారు. సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే తాము కిందపడిపోయే వాళ్లమన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో వారు మీడియాతో చిట్‌‌చాట్ చేశారు. దెబ్బ తగిలింది తమకని, తమ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తమవి నాటకాలంటున్నారని మండిపడ్డారు.

తమకు జరిగిన అవమానంపై అధికార మహిళా సభ్యులు కనీసం తమవైపు చూడలేదన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులను పెట్టి శిఖండి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్‌‌కు ఇబ్బంది అయిందని కేసు పెట్టించారని, మరి తమకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరని నిలదీశారు. దళితుల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారని, మహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవం కాదా అని ప్రశ్నించారు.

తమకు జరిగిన అవమానంపై సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రభుత్వానికి సమాచారం వస్తుందని, తమపై జరిగిన దాడి గురించి సమాచారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాతా మధు అనని వ్యాఖ్యలను స్పీకర్‌‌కు ఆపాదించి సభను రెండు రోజులు నడిపించారన్నారు. అదే సమయంలో కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సభలో ఉంచుకున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందని వారు ప్రశ్నించారు. 

©️ VIL Media Pvt Ltd.