Reading Time: < 1 minute

టేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Caption of Image.

టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, ప్రయోగశాలలు, భోజనం, పరిశుభ్రత, యూనిఫాంలు, వెల్నెస్ సెంటర్‌‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తరగతి సమయాన్ని పూర్తిగా విద్యాబోధనకే కేటాయించాలని, గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, స్కౌట్స్ అండ్ గైడ్స్, బ్యాంకు ఖాతాల ప్రారంభం వంటి కార్యక్రమాలను తరగతుల అనంతరం లేదా శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. 

విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రతి పీరియడ్‌‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. భౌతిక శాస్త్ర ప్రయోగశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన అందించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. కొత్తగా చేరిన విద్యార్థులకు యూనిఫాంలు త్వరగా అందించాలని ఆదేశించారు. భోజనశాల, వంటగది, మరుగుదొడ్లలో పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన వంట మనిషి సెలవులో ఉన్నందున ప్రత్యామ్నాయ వంట మనిషిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో శ్రీదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.