
- జూన్ 30 నుంచి నిందితుడు మల్లేశ్ కదలికలు, కాంటాక్ట్‌లపై ఆరా
- డిలీట్ చేసిన డేటాను రిట్రీవ్ చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు మొబైల్ ఫోన్
- సోషల్ మీడియా అకౌంట్లు, కాల్ డేటాను జల్లెడ పడుతున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులకు చిక్కుముడులు వీడడం లేదు. ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఆయుధాలు అపహరించానని నిందితుడు ఉప్పుతల్ల మల్లేశ్ అలియాస్ రాజు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
అరెస్ట్ చేయడానికి ముందే మల్లేశ్ తన వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను డిలీట్ చేయడంతో ఆయుధాల చోరీలో మరికొంత మంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మల్లేశ్‌ను మేడ్చల్-మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మల్లేశ్‌ను విచారించినా ఆయుధాల అపహరణకు గల అసలు కారణాలను పూర్తిస్థాయిలో రాబట్టలేకపోయారు.
దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఉగ్రకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మల్లేశ్ వినియోగించిన వాట్సాప్ డేటాను రిట్రీవ్ చేయడంతోపాటు, సోషల్ మీడియా అకౌంట్లు, గత ఆరు నెలల కాల్ హిస్టరీ డేటాను సేకరిస్తున్నారు. అందుకోసం మొబైల్ ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపించారు.
ప్రధానంగా జూన్ 30న ఉద్యోగంలో నుంచి తొలగించిన నాటి నుంచి మల్లేశ్ కదలికలు ఎలా ఉన్నాయి ? దొంగిలించిన ఆయుధాలను ఎక్కడికి తరలించేందుకు పథకం రచించాడు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల కాలంలో మల్లేశ్‌తో పరిచయం పెంచుకున్న కొత్త వ్యక్తులు, స్నేహితుల్లో నేరచరిత కలిగిన వారి గురించి ఆరా తీస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్ నుంచి పనిష్మెంట్ కింద గతంలో డిస్మిస్ అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.