Reading Time: 2 minutes
Raghav Chadha Calls Aap Ex Girlfriend Amid Delhi Voter List Sir Row

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ ఓటర్ లిస్టులో తన పేరు ఎలా చేరిందనే ప్రశ్నలపై చద్ధా స్పందిస్తూ.. ఆప్ ఇంకా నన్ను మరిచిపోలేకపోతోందని, తన పేరు పదేపదే ప్రస్తావిస్తూ.. ‘‘ఎక్స్-గర్ల్ ఫ్రెండ్’’లా వ్యవహరిస్తోందని సెటైర్లు వేశారు. ‘‘నేను మూవ్ అన్ అయ్యాను, కానీ ఆప్ మాత్రం నా గురించే కలలు కంటోంది, నా పేరు జపిస్తోంది. ఆప్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌లా వ్యవహరిస్తోంది. బాయ్ ఫ్రెండ్ మాత్రం మూవ్ ఆన్ అయ్యాడు’’ అని అన్నారు.

ఢిల్లీ ఓటర్ జాబితాలో రాఘవ్ చద్దా పేరు చేర్చడంపై ఆప్ ఎన్నికల సంఘం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది. కొత్త ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్-6 ఎప్పుడు ఎక్కడ దాఖలైందో వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఆప్ జాతీయ మీడియా ఇన్‌చార్జ్ అనురాగ్ ధండా మాట్లాడుతూ.. రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు వచ్చిన ఫారమ్- 6 దరఖాస్తుల్లో చద్దా పేరు లేదని పేర్కొన్నారు.

ఆగస్టు 31న విడుదలైన ముసాయిదా జాబితాలో రాజేందర్ నగర్ నియోజకవర్గంలో 746వ సీరియర్ నంబర్ వరకు మాత్రమే ఎంట్రీలు ఉన్నాయని, అయితే చద్దా పేరు 747వ స్థానంలో ఎలా వచ్చిందని ఆప్ ప్రశ్నించింది. తుది ఓటర్ జాబితా నవంబర్ 4న ప్రచురించాల్సి ఉంది. ఆప్ నుంచి బీజేపీలోకి రాఘవ్ చద్దా చేరిన కొన్ని నెలల తర్వాత ఈ వివాదం రెండు పార్టీల మధ్య వేడికి కారణమైంది. రాఘవ్ చద్దా ఓటర్ లిస్టులో పేరు అంశంపై రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే, చద్దా పంజాబ్‌లోని ఆప్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని, డ్రగ్స్ కోసం క్యూలు కడుతున్నారని విమర్శించారు. సంగ్రూర్‌కు చెందిన గుల్జార్ సింగ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చద్దా మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల తన కుమారుడు ఇబ్బంది పడుతున్నాడని ప్రశ్నించిన గుల్జార్ సింగ్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. ఒక సమస్యపై ప్రశ్నించడం నేరమా? అని చద్దా ఫైర్ అయ్యారు. గుల్జార్ సింగ్ ఆత్మహత్యకు ముందు అవమానానికి గురయ్యారని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతల్ని ఆప్ కార్యకర్తలు, అధికారులు అడ్డుకున్నారని ఆరోపించారు. గత 15 ఏళ్లలో పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య పెరిగిందని, ఈ సమస్యపై ఆప్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.