
తిర్యాణి, వెలుగు: మాదిగ జాతిని అవమానించేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, దీనిపై కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద మాదిగల ఆందోళన జరిగిన ప్రదేశంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘం నేత పుల్లూరి శ్యామ్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత నాయకుడిని అవమానించడంతో పాటు మాదిగలు నడిచిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అంటరానితనాన్ని ప్రదర్శించడమేనన్నారు. ఈ చర్య మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు నీళ్లు చల్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కరిగంటి బాపు, గద్దెల మొగిలి, సెర్ల ఎల్లయ్య, మల్యాల అరవింద్, గొడిసెల సాయిరాజ్, జుల విజయ్, ఇప్ప లింగయ్య, వేల్పుల రాజశేఖర్, కరిగంటి రమేశ్ పాల్గొన్నారు.