
గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్… అంటే మా రోడ్లపై నుంచి తక్షణం వెళ్లిపోరా ఓ సిక్కులోడా…! ప్రజాస్వామ్య దేశంలో ఈ మాట అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా…? కానీ ఇంత మాట ప్రభుత్వమే అధికారికంగా అంటే…! అదే జరిగింది. ట్రంప్ ఆదేశాల మేరకు వలసవాదులను ఎలాగైనా సరే వదిలించుకోవాలని కంకణం కట్టుకున్న అమెరికా హోంశాఖ.. గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్ అంటోంది. ఇంతకు మించిన జాతి వివక్ష మరొకటి ఉంటుందా…? భారతీయ మూలాలున్న సిక్కులను ఉద్దేశించి ఎందుకు ఇలాంటి పోస్టర్లు పెట్టారు ? సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
స్వేచ్చ… స్వాతంత్ర్యాలు.. డెమొక్రటిక్ స్పిరిట్ అంటూ అమెరికా పైకి చెప్పుకుంటుంది గానీ అక్కడి పాలకుల నరనరాల్లో జాతి వివక్ష ఇంకిపోయి ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్స్ పోస్ట్. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమా తరహాలో ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. అందులో ఒక సిక్కు వ్యక్తిని ఉద్దేశించి… మీకు డ్రైవింగ్ రాదు.. మా రోడ్ల మీది నుంచి వెళ్లిపోండి మిస్టర్ సింగ్ అని రాశారు. సెల్ఫ్ డిపోర్ట్ అవ్వండి… అమెరికా అమెరికన్లకే.. లాంటి వ్యాఖ్యలు అందులో రాశారు. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమెరికాలో ఉంటున్న కమర్షియల్ సిక్కు డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పోస్ట్ పై సిక్కు కమ్యూనిటీతో పాటు రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఈ క్యాంపెయిన్‌ను అత్యంత అసహ్యకరమైనదిగా అభివర్ణించారు. సిక్కులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ప్రభుత్వం జాతి విద్వేష ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. అటు మిచిగాన్ డెమొక్రాటిక్ లీడర్ రంజీవ్ సింగ్ పూరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగ్ అనేది కోట్లాది మంది సిక్కులు గర్వంగా ధరించే పేరు అని.. దానిని ఒక జోక్ లా వాడటం సరికాదన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. సిక్కు కోయలిషన్ సంస్థలు డీహెచ్ఎస్ తీరును తీవ్రంగా ఖండించాయి.
అసలు సిక్కులనే ఎందుకు టార్గెట్ చేశారనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అమెరికా రవాణా రంగంలో సిక్కులు భారీ సంఖ్యలో ఉన్నారు. కమర్షియల్ డ్రైవర్లకు ఇంగ్లీష్ భాషా పరీక్షలు కఠినతరం చేయాలని అమెరికా రవాణా శాఖ నిర్ణయించింది. ఇంగ్లీష్ సరిగా రాని కారణంగా ఇప్పటికే 26 వేల మంది కమర్షియల్ డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. ట్రక్స్ తో వాళ్లను రోడ్డపైకి రానివ్వడం లేదు. సరైన ఇంగ్లీష్ రాని వాళ్లు పెద్దపెద్ద ట్రక్కులు నడపడానికి అనర్హులంటూ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. పైకి ఇదేదో ఇంగ్లీష్ ఇష్యూలా కనిపించినా… అమెరికాలో ఉంటున్న వలస వాదులను వెనక్కి పంపించేయడమే అసలు ఉద్దేశం.
అమెరికా ట్రక్కింగ్ రంగంలో మొదటి నుంచి పంజాబీల ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం అమెరికాలోని మొత్తం ట్రక్ డ్రైవర్లలో 20 శాతం మంది సిక్కులే ఉన్నారు. వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో అయితే ఏకంగా 40 శాతం మంది సిక్కులే ఈ వృత్తిలో స్థిరపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షా 50 వేల మంది సిక్కు డ్రైవర్లు సేవలు అందిస్తున్నారు. చాలా మంది డ్రైవర్లుగా మొదలై… ఇప్పుడు భారీ ఫ్లీట్ ఓనర్లుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. మై నేమ్ ఈజ్ సింగ్… ఐయామ్ నాట్ ఏ బ్యాడ్ ట్రక్ డ్రైవర్ అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు…
ఇలాంటి విద్వేషపూరిత పోస్టుల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సిక్కులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత గడ్డం, టర్బన్ చూసి సిక్కులను అరబ్బులుగా పొరబడి దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2023 నవంబర్ లో ట్రాఫిక్ ప్రమాదం జరిగినప్పుడు జస్మేర్ సింగ్ అనే వృద్ధుడిపై దాడి చేసి చంపేశారు. ఇటీవల న్యూయార్క్ బస్సులో ఒక సిక్కు యువకుడిపై కూడా విద్వేష దాడి జరిగింది. ఇప్పుడు ఈ తాజా ప్రచారం వల్ల కమ్యూనిటీపై మరింత వివక్ష పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
వివాదం ముదిరి అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఆ పోస్టును డిలీట్ చేసింది. ఒకప్పుడు నల్లజాతీయులను బానిసలుగా చూసిన తెల్లతోలు అమెరికా సమాజానికి ఇప్పుడు ఇమిగ్రెంట్స్ అంటే అస్సలు గిట్టడం లేదు. అందుకే అప్పుడప్పుడు ఇలా జాతి విద్వేషపు పనులు చేస్తుంటారు. ఇలాంటి విషపు ధోరణులను అమెరికా సమాజం ఖండించకపోతే… అసలుకే మోసం రావడం మాత్రం ఖాయం.