
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో విద్యకు కేవలం 8.2 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రైమరీ స్కూళ్ల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అన్నీ మూతపడే దుస్థితి వచ్చిందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యలో ఇనిషియేటివ్స్‌పై చర్చ సందర్భంగా మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గురుకులాలు, ప్రభుత్వ బడుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. యూడైజ్ నివేదిక ప్రకారం 1,859 స్కూళ్లలో తాగునీటి సదుపాయం లేదని, 1,752 బడుల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు. జీవో 97ను రద్దు చేయడంతో పాటు జీవో 317 సవరణ, స్పౌస్ బదిలీలు, 53 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.