Reading Time: 2 minutes
Ishan Kishan Duleep Trophy Record 350 Runs In 2026 Final

Ishan Kishan Duleep Trophy Record: టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నయా చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఇషాన్ 350 పరుగులు చేసి ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 344 బంతుల్లో 270 పరుగులు చేసిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 98 బంతుల్లో 80 పరుగులు బాదాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడి వ్యక్తిగత పరుగుల సంఖ్య 350కి చేరింది. ఫలితంగా దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

ఇషాన్ కిషన్ రేర్ రికార్డు:

1987 అక్టోబర్‌లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున ఆడిన రమణ్ లాంబా 320 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఓ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రమణ్ ఉన్నాడు. ఇప్పుడు 350 పరుగులతో ఇషాన్ కిషన్ ఆ రికార్డును అధిగమించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఇషాన్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేసేలా కనిపించినా.. క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ 270 పరుగులు చేయడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం సౌత్ జోన్‌ను 336 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్‌ ఐదు వికెట్లకు 212 రన్స్ చేసింది. ప్రస్తుతం 584 రన్స్ ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ టైటిల్ దక్కించుకోనుంది.

ఓవర్ థింకింగ్ చేయడం లేదు:

భారీ ఇన్నింగ్స్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎదురైన క్లిష్ట పరిస్థితుల తర్వాత ప్రస్తుతం తాను ఓవర్ థింకింగ్, అంచనాలకు దూరంగా ఉంటూ బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని చెప్పాడు. ‘భారత జట్టుకు దూరమైన సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. క్రికెటర్‌గా చేయాల్సిన ప్రధాన పని పరుగులు చేయడమే. ఇతర ఆలోచనలు మన మైండ్‌ను ప్రభావితం చేస్తాయి. అవసరానికి మించి ఆలోచించడం, ఒత్తిడిని పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మైదానంలోకి వెళ్లి జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించడంపైనే దృష్టి పెట్టాలి. కాలంతో పాటు మనలో మార్పు వస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే బ్యాటింగ్ చేయడం మరింత సులభం’ అని చెప్పాడు.

భారత జట్టుకు దూరం:

2023లో భారత జట్టులో మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో జట్టుకు దూరమయ్యాడు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. అయితే ఆ పరిస్థితుల నుంచి వెనక్కి తగ్గకుండా దేశవాళీ క్రికెట్‌లో కష్టపడ్డాడు. 2025-26 రంజీ ట్రోఫీలో సెంచరీలు సాధించిన ఇషాన్.. అదే సీజన్‌లో జార్ఖండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 517 పరుగులు చేయగా.. రెండు సెంచరీలు నమోదు చేశాడు. అతడి నిలకడైన ప్రదర్శనకు ఫలితంగా తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు భారత వైట్‌బాల్ జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు టీ20, వన్డేల్లో చెలరేగుతున్నాడు.