
Logitech MX Keypad: ప్రముఖ టెక్ యాక్సెసరీస్ బ్రాండ్ Logitech భారత మార్కెట్లో కొత్త MX Keypadను విడుదల చేసింది. AI టూల్స్, కోడింగ్, క్రియేటివ్ సాఫ్ట్‌వేర్, ప్రొడక్టివిటీ యాప్స్‌తో పనిచేసే డెవలపర్లు, ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త కీప్యాడ్‌ను రూపొందించింది. ఈ డివైస్‌లో ప్రధాన ఆకర్షణగా 9 కస్టమైజబుల్ LCD కీలు ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఈ కీలకు వివిధ షార్ట్‌కట్‌లు, కమాండ్లు, యాప్ కంట్రోల్స్‌ను కేటాయించుకోవచ్చు.
Logitech MX Keypad ధర ఎంత?
భారత్‌లో Logitech MX Keypad ధరను రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది Graphite కలర్‌లో లభిస్తుంది. ప్రస్తుతం Logitech India ఆన్‌లైన్ స్టోర్‌లో త్వరలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. అయితే సేల్ ప్రారంభ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ డివైస్‌తో పాటు ఒక సంవత్సరం లిమిటెడ్ హార్డ్‌వేర్ వారంటీ లభిస్తుంది. లాంచ్ సమయంలో MX Keypad కొనుగోలు చేసే వినియోగదారులకు మూడు నెలల GitHub Copilot Pro+ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
9 కస్టమైజబుల్ LCD కీలు ప్రత్యేకత
Logitech MX Keypadలో ఉన్న 9 LCD కీలు ఈ డివైస్‌కు ప్రధాన ప్రత్యేకత. వీటిని Logi Options+ యాప్ ద్వారా వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు AI మోడల్స్‌ను లాంచ్ చేయడం, షార్ట్‌కట్‌లను యాక్టివేట్ చేయడం, క్రియేటివ్ టూల్స్‌ను కంట్రోల్ చేయడం వంటి పనులకు ఒక్కో కీలను కేటాయించుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. కీలు ఉపయోగిస్తున్న యాప్ లేదా AI టూల్ ఆధారంగా తమ ఫంక్షన్‌లను మార్చుకోగలవు. దీంతో తరచుగా ఉపయోగించే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. LCD కీల కింద మరో రెండు నావిగేషన్ బటన్లను కూడా అందించారు.
AI, కోడింగ్ టూల్స్‌కు సపోర్ట్
AI ఆధారిత టూల్స్, కోడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పనిచేసే వారికి MX Keypad ఉపయోగకరంగా ఉంటుందని Logitech చెబుతోంది.
ఈ కీప్యాడ్ కింది టూల్స్‌తో పనిచేస్తుంది:
Visual Studio Code
GitHub Copilot
IntelliJ IDEA
Claude Code
OpenAI Codex
అంటే AI కోడింగ్ అసిస్టెంట్లు, డెవలప్‌మెంట్ టూల్స్‌ను తరచుగా ఉపయోగించే వారికి త్వరిత నియంత్రణలు అందుబాటులో ఉంటాయి.
Zoom నుంచి Figma వరకు..
కేవలం AI, కోడింగ్ టూల్స్‌కే కాకుండా పలు ప్రొడక్టివిటీ, కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా Logitech MX Keypad సపోర్ట్ ఇస్తుంది. వీటిలో Zoom, Spotify, Microsoft Teams, PowerPoint, Excel, Notion, Slack, Figma వంటి యాప్స్ ఉన్నాయి.
క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు కూడా ఉపయోగకరం
ఫోటో, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి పనులు చేసే వారికి కూడా MX Keypadలో ప్రత్యేక కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
ఇది కింది క్రియేటివ్ సాఫ్ట్‌వేర్‌లకు సపోర్ట్ చేస్తుంది.. Adobe Lightroom, Adobe Photoshop, Adobe Premiere Pro, Adobe After Effects, Final Cut Pro, DaVinci Resolve, OBS Studio తరచుగా ఉపయోగించే టూల్స్ లేదా కమాండ్లను LCD కీలకు కేటాయించుకోవడం ద్వారా వర్క్‌ఫ్లోను వేగవంతం చేసుకోవచ్చు.
Windows, Macలకు సపోర్ట్
Logitech MX Keypad Windows 10 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లతో పనిచేస్తుంది. అలాగే macOS 13 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లకు కూడా సపోర్ట్ ఉంటుంది. అందువల్ల Windows, Mac రెండింటినీ ఉపయోగించే ప్రొఫెషనల్స్‌కు ఈ కీప్యాడ్ ఉపయోగపడుతుంది.
కాంపాక్ట్ డిజైన్.. తక్కువ బరువు
MX Keypad కాంపాక్ట్, తేలికైన డిజైన్‌తో వచ్చింది. దీని కొలతలు 91.7 x 77.9 x 25.5 మిల్లీమీటర్లు, బరువు సుమారు 96 గ్రాములు. దీనితో వచ్చే స్టాండ్ కొలతలు 112.7 x 58.5 x 20.5 మిల్లీమీటర్లు, బరువు సుమారు 61 గ్రాములు. అంతేకాకుండా ఉత్పత్తి తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను ఉపయోగించినట్లు Logitech తెలిపింది.
ఎవరికి ఉపయోగపడుతుంది?
Logitech MX Keypad ముఖ్యంగా AI టూల్స్‌తో పనిచేసే డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లు, వీడియో ఎడిటర్లు, డిజైనర్లు, ప్రొడక్టివిటీ యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఉపయోగపడేలా రూపొందించారు. రూ.15,999 ధరతో సాధారణ కీప్యాడ్ కంటే ఇది ఖరీదైనదే అయినప్పటికీ, 9 కస్టమైజబుల్ LCD కీలతో AI, కోడింగ్, క్రియేటివ్ సాఫ్ట్‌వేర్‌లను ఒకే చోట నుంచి త్వరగా కంట్రోల్ చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన యాక్సెసరీగా నిలవనుంది.