
BRICS Summit 2026 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీకి కొత్త కళ వచ్చింది.. 18వ BRICS శిఖరాగ్ర సమావేశం నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. భారత్ మండపం వేదికగా జరిగే ఈ సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సాయంత్రం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న భేటీపై అందరి దృష్టి నెలకొంది.
మోడీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు
సదస్సు తొలిరోజు ప్రధాని మోడీ బిజీ షెడ్యూల్‌తో కొనసాగనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీతో సమావేశం కానున్నారు. అనంతరం 10:30 గంటలకు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు అబుదాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో, 11:30 గంటలకు వియత్నాం నాయకుడు లే మిన్ హంగ్‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశమవుతారు.
మధ్యాహ్నం నుంచి BRICS ప్రధాన కార్యక్రమాలు
మధ్యాహ్నం 2 గంటలకు BRICS సభ్య దేశాల నాయకులు భారత్ మండపంలోని రెండో అంతస్తుకు చేరుకుంటారు. 2:35 గంటలకు శిఖరాగ్ర సమావేశ మందిరంలో “సమ్మిళిత ప్రపంచ పాలన మరియు బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం” అనే అంశంపై కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 4:25 గంటలకు నేతలు భారత్ మండపంలోని హాల్-14లో ఏర్పాటు చేసిన ‘భారత్ ఇన్నోవేట్స్ ఎగ్జిబిషన్’ను సందర్శిస్తారు. అనంతరం 5:05 గంటలకు కుటుంబ ఫొటో సెషన్, 5:10 గంటలకు నేతల సమక్షంలో ఉమ్మడి వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
షీ జిన్‌పింగ్‌తో మోడీ భేటీ
BRICS సదస్సులో అత్యంత కీలకమైన సమావేశాల్లో ఒకటిగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ నిలవనుంది. సాయంత్రం 5:45 గంటలకు భారత్ మండపంలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. షీ జిన్‌పింగ్ ఇప్పటికే భారత్‌కు బయలుదేరారు. అంతకుముందు శుక్రవారం ప్రధాని మోడీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు నేతలతో సమావేశమయ్యారు.
రాత్రి నేతలకు విందు
BRICS సదస్సు తొలిరోజు కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు భారత్ మండపంలోని మూడో అంతస్తులో ప్రధాని నరేంద్ర మోడీ నేతలకు విందు ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
BRICS సదస్సు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ సలహా జారీ చేశారు. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు లూటియన్స్ ఢిల్లీ, భారత్ మండపం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణలు, మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ సలహా మ్యాప్‌లో నియంత్రిత రహదారులు, నిషేధిత ప్రాంతాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపు పాయింట్లను ప్రత్యేక రంగులతో సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను నీలం, నియంత్రిత రహదారులను నారింజ, నిషేధిత ప్రాంతాలను ఊదా రంగులో చూపించారు. మళ్లింపు పాయింట్లను ఎరుపు నక్షత్రాలతో గుర్తించారు.
వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం
మరోవైపు BRICS సదస్సు జరుగుతున్న సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా చర్చనీయాంశంగా మారాయి. పలు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రాబోయే రెండు రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో BRICS సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ నేతల భద్రత, రాకపోకలతో పాటు ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.